ఆత్మ నిర్భర్‌ భారత్‌ 2: మళ్ళీ మళ్ళీ అదే అంకెల గారడీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్’ పేరుతో ప్రకటించిన విషయం విదితమే. దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడించే క్రమంలో నిన్న కొన్ని విషయాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీన్ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ -1’గా భావిస్తే, ఈ రోజు ఎపిసోడ్‌ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ 2’ అనుకోవాలి.

ఇక, ఫస్ట్‌ ఫేజ్‌ ఎంత నిరాశపర్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రెండో ఫేజ్‌ కూడా ఎవర్నీ మెప్పించలేకపోయింది. కిసాన్‌ కార్డుదారులకు 25 వేల కోట్ల రుణాలు, మత్సకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు.. వంటి అంశాలున్నాయి నిర్మలా సీతారామన్‌ నేడు మీడియా ముందుకొచ్చి చేసిన ప్రసంగంలో. ముద్ర రుణాల గురించి మాట్లాడారు.. మారటోరియం గురించి ప్రస్తావించారు. వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.

స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్‌ నుంచి ఒకే దేశం ఒకే కార్డు.. అమల్లోకి వస్తుందనీ, రేషన్‌ కార్డుదారులు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని అన్నారు నిర్మలా సీతారామన్‌. దేశమంతా ఒకటే కనీస వేతనం వుండేలా చూస్తామంటూ నిర్మలమ్మ చేసిన ప్రకటన పట్ల కార్మిక లోకం నుంచి కొంత హర్షం వ్యక్తమవుతోంది.

వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం 4,200 కోట్లు కేటాయించనుండడం సహా పలు అంశాల్ని నిర్మలమ్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, నిర్మలా సీతారామన్‌ ప్రసంంగంలో ఎక్కువగా ‘అప్పుల ప్రస్తావన’ వుంది తప్ప, నేరుగా ‘కరోనా బాధితులకు’ సాయం అనేది లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌.. అనేది చాలాకాలంగా చర్చల్లో వున్నదే. దాన్ని, ఇప్పుడెందుకు ప్రాస్తావించడం.? అన్న ప్రశ్న విపక్షాల నుంచి దూసుకొస్తోంది. మొత్తమ్మీద, కొత్త సీసాలో పాత సారా.. అన్నట్లు తయారైంది కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని పక్కన పెట్టి, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అంకెల డ్రామాని కేంద్రం తెరపైకి తెచ్చిన విషయం గుర్తుంది కదా.? ఇప్పుడీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ కూడా.. అదే తరహా అంకెల గారడీని తలపిస్తోంది. చూద్దాం.. ముందు ముందు ఈ ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకెన్ని అంకెల గారడీలు చేస్తారో.