అప్పుడు జస్ట్ హిట్.. ఇప్పుడు మాస్టర్ పీస్

కొన్ని సినిమాలు థియటర్లలో ఉండగా వాటి గొప్పదనం ప్రేక్షకులకు తెలియదు. వాటి స్థాయికి తగ్గ ఫలితం అందుకోవు. కానీ తర్వాత చూస్తున్న కొద్దీ వాటి గొప్పదనం అర్థమవుతుంది. ఇంత గొప్ప సినిమాను థియేటర్లలో ఎలా మిస్సయ్యామని చూడని వాళ్లనుకుంటే.. ముందు థియేటర్లలో చూసినపుడు ఇది ఇంత స్పెషల్ అనిపించలేదే అని చూసిన వాళ్లు అనుకుంటారు.

ఈ కోవకే చెందుతుంది ‘జెర్సీ’ సినిమా. ఇలా అంటున్నామంటే ఇదేమీ ఫ్లాప్ మూవీ కాదు. మంచి ఫలితమే అనుకుంది. హిట్ స్టేటస్ అందుకుంది. కానీ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ డ్రామా అయిన ఈ సినిమాకు అంతకుమించిన ఫలితం రావాల్సిందనడంలో మరో మాట లేదు. ఒక స్టార్ హీరో చేసి.. సరిగ్గా ప్రమోట్ చేస్తే వంద కోట్ల షేర్ రాబట్టాల్సినంత విషయం ఉన్న సినిమా అది. ఐతే ఈ సినిమా రూ.30 కోట్ల షేర్‌కు పరిమితమైంది.

నాని రేంజ్ ప్రకారం చూసినా ఇంకా ఎక్కువే వసూలు చేయాలా సినిమా. ‘ఎంసీఏ’ లాంటి సినిమా రూ.35 కోట్ల షేర్ రాబట్టినపుడు కంటెంట్ పరంగా దానికి ఎన్నో రెట్లు ఉన్న ‘జెర్సీ’ ఇంకా ఎక్కడికో వెళ్లాల్సింంది. ఇంతకీ ఈ సమయంలో ‘జెర్సీ’ గురించి ఈ చర్చ ఎందుకు అంటే. ఏప్రిల్ 19తో ఈ సినిమా వార్షికోత్సవం పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ట్విట్టర్లో ‘జెర్సీ’ గురించి పెద్ద చర్చే నడిచింది. ఈ సినిమా గురించి గుర్తు చేసుకున్న వాళ్లందరూ ఎమోషనల్ అయిపోయారు. సినిమా గురించి చాలా గొప్పగా రాశారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనదగ్గ సినిమా ఇదని పేర్కొన్నారు. అందులో ఆణిముత్యాల్లాంటి ఒక్కో సన్నివేశం గురించి అద్భుతంగా చెప్పుకొచ్చారు.

నాని పెర్ఫామెన్స్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మీదా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ట్వీట్లు, కామెంట్లు చూస్తుంటే ‘జెర్సీ’ ఇంత గొప్ప సినిమానా అనిపిస్తోంది. అప్పుడు థియేటర్లలో ఈ సినిమాకు జస్ట్ ‘హిట్’ స్టేటస్ అందించారు కానీ.. ఇప్పుడు మాత్రం ఇదో ‘మాస్టర్ పీస్’ అని తీర్మానిస్తున్నారు. ఐతే ‘జెర్సీ’ హిందీలో షాహిద్ హీరోగా తెరకెక్కుతోంది కాబట్టి అక్కడైనా కంటెంట్‌కు తగ్గ హిట్టయి గౌతమ్‌కు మరింత సంతృప్తిని అందిస్తుందేమో చూడాలి.