బరువు తగ్గిన లోకేష్.. మార్పు మొదలైందంటున్న తెలుగు తమ్ముళ్ళు.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఒకింత బొద్దుగా వుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ బొద్దుతనం మీద రాజకీయంగా చాలా విమర్శలు.. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చూస్తున్నాం. రాజకీయ నాయకులు విలువతో కూడిన రాజకీయాలు చేయడం అనేది ఎప్పుడో మాయమైపోయింది.

సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మీద గతంలో అసెంబ్లీ సాక్షిగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అప్పటి టీడీపీ నేతలనుంచి వచ్చాయి. బాడీ షేమింగ్ మీద గుస్సా అయిన రోజా కూడా, టీడీపీ నేత అచ్చెన్నాయుడి మీద బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం.. రాజకీయాల్లో పతనమైపోయిన విలువలకు నిదర్శనం. తన శరీరం మీద వస్తున్న విమర్శల నేపథ్యంలో బాగా ఆలోచించి, సన్నబడాలనే నిర్ణయం బహుశా లోకేష్ తీసుకుని వుండొచ్చు. గత కొద్ది రోజులుగా ఆయన సన్నబడుతున్నారు. గతంలో ఆయన్ని చూసినవారికి, కాస్త గ్యాప్ తర్వాత ఆయన్ని చూస్తే.. చాలా మార్పు కనిపిస్తోంది. మార్పు ఒక్క శరీరంలోనే కాదు, ఆయన ఆలోచనల్లోనూ వచ్చిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించగలిగిందంటే అది నారా చంద్రబాబు కష్టంతోపాటు, నారా లోకేష్ కష్టం వల్ల కూడానన్నది తెలుగు తమ్ముళ్ళ వాదన. వైఎస్ వివేకా హత్య కేసు విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నారా లోకేష్ టార్గెట్ చేసిన వైనాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. లోకేష్ దెబ్బకి, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్ళలేకపోయారు వైఎస్ జగన్. వెళ్ళి వుంటే, వైఎస్ వివేకా హత్యతో తనకు సంబంధం లేదని ప్రమాణం చేయాల్సి వచ్చేది.. నారా లోకేష్ డిమాండ్ మేరకు.

ఇదిలా వుంటే, పార్టీకి చెందిన నేతలతో సమన్వయం చేయడంలో నారా లోకేష్ నాయకత్వ లక్షణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ‘లోకేష్ వల్ల పార్టీ నాశనమైపోయింది..’ అంటూ ఒకప్పుడు వినిపించిన విమర్శలు ఇప్పుడు లేవు. అపరిపక్వంగా ఒకప్పుడు రాజకీయ విమర్శలు చేసిన నారా లోకేష్, ఇప్పుడు పూర్తి పరిపక్వతతో కూడిన ప్రసంగాలు చేస్తున్నారు. ఇవన్నీ తెలుగు తమ్ముళ్ళలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

లోకేష్ గనుక, పార్టీని సమర్థవంతంగా చక్కదిద్దగలిగితే, చంద్రబాబు మీద ఒత్తిడి దాదాపు తగ్గిపోవడం ఖాయం. ఏం చేసినా అది పార్టీ కోసమే.. అంటూ, నారా లోకేష్ తనలోని మార్పు వెనుక చాలా కారణాలు వున్నాయంటున్నారు.