నాయిని అంత్యక్రియలు.. పాడె మోసిన కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్

నిమోనియాతో చికిత్స తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత, కార్మిక నాయకుడు నాయిని నరసింహారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్ లో జరిగాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మీయ నేతను కడసారి చూసేందుకు కార్మికులు, టీఆర్ఎస్ నేతలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

నాయిని అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. వీరిద్దరూ పాడె మోసి నాయినికి నివాళి అర్పించారు. అయితే.. ఆయన అంత్యక్రియల్లో జేబుదొంగలు స్వైర విహారం చేయడం విడ్డూరంగా మారింది.

నాయిని మృతితో శోకసంద్రంలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను జేబుదొంగలు ఆసరాగా చేసుకున్నారు. అక్కడున్న పోలీసులకు కూడా వారు బెదరలేదు. తమ చేతివాటంకు పని చెప్పారు. చాలా మంది కార్యకర్తల జేబుల్లో డబ్బు కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఓ కార్యకర్త జేబులో నుంచి డబ్బులు తీస్తూండగా సదరు జేబుదొంగను పట్టుకున్నారు. దీంతో అక్కడే అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.