రైతు ఆదాయం పెంచాలన్నదే మా అభిలాష: మోదీ

దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయం పెంచాలన్నదే తమ అభిలాష అని, నూతన వ్యవసాయ చట్టాలతోనే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్యనున్న అడ్డుగోడలు వీటితో తొలగిపోయాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా అన్నదాతలకు లబ్ధి కలుగుతుందన్నారు. శనివారం ఫికీ 93వ వార్షిక సమావేశంలో మోదీ మాట్లాడారు.

భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయని, దీనివల్ల రైతన్నలకు మరింత లాభం చేకూరుతుందని స్పష్టంచేశారు. రైతుల ప్రయోజనాలకు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. త్వరలో కోల్డ్ స్టోరేజీలను ఆధునీకరిస్తామని తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో రైతుల ఆందోలన కొనసాగుతున్న తరుణంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా, రైతుల ఆందోళన శనివారానికి 17వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఎన్ని ప్రతిపాదనలు చేసినా రైతులు ససేమిరా అంటున్నారు. కొత్త చట్టాల రద్దు తప్ప ఇంకేం చెప్పినా అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించింది.