వాట్ నెక్ట్స్? సలహాదారు బాధ్యత కుదరదంటూ ఆ సీఎంకు షాకిచ్చాడు

ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా.. రాజకీయ పార్టీలకు దన్నుగా నిలవటం.. దేశాన్ని ప్రభావితం చేసే రాజకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఎన్నికల్ని ఒక కమర్షియల్ ప్రాసెస్ గా మార్చేసిన మేధావిగా కొందరి చేత పొగడ్తలు.. మరికొందరి చేత చావు తిట్లు తినే ప్రముఖుడిగా పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ సుపరిచితుడు. తాను ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా ఉంటానో.. ఆ పార్టీని ఎన్నికల్లో విజయ తీరాలకు తీసుకెళ్లే విషయంలో సక్సెస్ అయిన పీకే.. తన సత్తా ఏమిటన్న విషయాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో మరోసారి నిరూపించుకున్న విషయం తెలిసిందే.

మమత గెలుపు ఖాయమని చెప్పటమే కాదు.. 200 మార్కు దాటుతుందన్న మాటను చెప్పటమే కాదు.. చేతల్లో చేసి చూపించిన పీకే.. జాతీయస్థాయిలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయన్ను బీజేపీ ఏజెంట్ గా అభివర్ణించినా.. తాను టేకప్ చేసిన పార్టీకి ఇప్పటివరకు నష్టం కలిగించిన దాఖలాలు కనిపించవు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న వైనం తెలిసిందే. వ్యవస్థల్ని తన మాస్టర్ మైండ్ తో భ్రష్టు పట్టించారన్న వాదన తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే..తనపై వచ్చే విమర్శల్ని లైట్ తీసుకునే అతగాడు.. తన పని తనదే అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు.

తాజాగా మరో నిర్ణయంతో వార్తల్లోకి వచ్చారు. గడిచిన కొంతకాలంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా ఆ పదవికి రాజీనామా చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఆయన్నే నమ్ముకున్న అమరీందర్ కు పీకే నిర్ణయం షాకిచ్చిందని చెప్పక తప్పదు. ఇక.. తన రాజీనామాపై పీకే రియాక్టు అయ్యారు. తానీ నిర్ణయం వెనుక కారణం ఏమిటన్న విషయాన్ని తనదైన శైలిలో వెల్లడించారు.

ప్రజాజీవితం నుంచి కాస్తంత విరామం తీసుకునేందుకు తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించారు. మరి.. రానున్న రోజుల్లో ఏం చేస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం. పీకే నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పంజాబ్ ముఖ్యమంత్రికి నిరాశ పరుస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. కొంతకాలం విరామం తీసుకున్నాక. .కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తన రాజీనామా సందర్భంగా సీఎంకు రాసిన లేఖలో.. ”ఇప్పటికైతే నా భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికి.. నన్నునా విధుల్లో నుంచి రిలీవ్ చేయాలని కోరుతున్నా” అని అభ్యర్థించారు.

బెంగాల్ రాష్ట్ర ఎన్నికల తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని తేల్చిన ఆయన.. ఆ తర్వాత ఏం చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వటం లేదు. ఈ మధ్యనే కాంగ్రెస్ అధినాయకత్వంతో సమావేశం అయిన ఆయన..త్వరలోనే ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించనున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై స్పష్టత రాలేదు. ఆ మధ్యలో పీకే సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో చూడాలన్న తన కోరికను వెల్లడించారు. దీంతో.. ఆయన కాంగ్రెస్ లోకి చేరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆపార్టీ సీనియర్లు మాత్రం ఆయనకు పగ్గాలు అప్పజెప్పటానికి ముందు ఆయనకు పరిమితులు విధించాలని కోరుతున్నట్లు చెబుతున్నారట.

అయితే.. ఇందుకు పీకే ఒప్పుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది. తనకు.. తన ఆలోచనలకు పగ్గాలు వేసే పార్టీలో ఉండేందుకు ఆయన ఇష్టపడతారా? అన్నది మరో ప్రశ్నగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి మోడీ వ్యతిరేకుల్ని ఒక వేదిక మీదకు తీసుకురావాలన్న పీకే ఆలోచనగా చెబుతారు. దీనికి సంబంధించిన ఆయన ఇప్పటికే ప్రయత్నాలు షఉరూ చేశారని చెప్పాలి. ఇప్పటికైతే పీకే భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న దానిపై స్పష్టత రానప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్ లో చేరటం కాస్త సమయం తీసుకుంటారన్న మాట వినిపిస్తోంది. ఏం చేసినా పీకే తీసుకునే నిర్ణయం.. దేశ రాజకీయ పరిణామాల మీద ప్రభావం చూపుతుందని మాత్రం చెప్పక తప్పదు.