భవిష్యత్తులో సినిమా అనేదే ఉండదు

మామూలుగా సినిమాల్లో అవకాశాలు అందుకోవడం కోసం ముందు షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్‌ల ద్వారా తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటారు యువ దర్శకులు. ఐతే పూరి జగన్నాథ్ మాత్రం రివర్స్‌లో రాబోతున్నాడు. దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న పూరి.. భవిష్యత్తులో వెబ్ సిరీస్‌లు చేస్తానంటున్నాడు. భవిష్యత్తులో సినిమా అనేదే ఉండదని.. వెబ్ సిరీస్‌లే ఉంటాయని.. తాను కూడా త్వరలోనే వెబ్ సిరీస్‌ల వైపు వెళ్తానని పూరి చెప్పడం విశేషం.

‘‘మారుతున్న కాలానికి తగ్గట్లుగా మనమూ మారాలి. నేను ఖాళీగా ఉండలేను. ఒక్క రోజు ఖాళీ దొరికితే ఓ కథ రెడీ చేస్తా. నా దగ్గర మరో పదేళ్లకు సరిపడా కథలున్నాయి. వాటితో కుదిరినంత కాలం సినిమాలు చేస్తా. భవిష్యత్తులో సినిమా అనేదే ఉండదని నా అంచనా. రాబోయే కాలంలో సినిమా సిస్టమ్‌ మారుతుందనుకుంటున్నా. వెబ్‌ సిరీస్‌లే ఉంటాయని నా ఫీలింగ్‌. అందుకే నేనూ వెబ్‌ సిరీస్‌ల వైపు వెళ్లాలనుకుంటున్నా’’ అని పూరి తెలిపాడు.

సినిమాల్లో హిట్లు ఫ్లాపులు మన చేతుల్లో ఉండవని.. అందుకు హాలీవుడ్ సిడ్నీ ఆల్విన్ ఫీల్డ్ అనే లెజెండరీ స్క్రీన్ ప్లే రైటర్‌కు ఎదురైన అనుభవమే ఉదాహరణ అని పూరి తెలిపాడు. ‘‘స్క్రీన్‌ప్లే ఎలా రాయాలనే విషయంలో సిడ్నీ ఆల్విన్‌ ఫీల్డ్‌‌‌ సబ్‌ కా బాప్‌. స్క్రీన్‌ప్లే మీద బుక్స్‌ రాశాడు. హాలీవుడ్‌ అంతా ఆయన్నే ఫాలో అవుతోంది. నేనూ ఆ బుక్‌ చదివా. అలాంటాయన రెండు సినిమాలకు కథలు రాస్తే రెండూ ఫ్లాపే. థియరీ వేరు. ప్రాక్టికల్‌ వేరు. సినిమా హిట్టూఫ్లాపులు మన చేతుల్లో ఉండవు’’ అన్నాడు పూరి.