ఆ రోజు ఎన్టీఆర్ కాదు.. నితిన్ వస్తాడు

సమ్మర్ సందడి ముగిశాక పెద్ద సినిమాలు టార్గెట్ చేసేది ఆగస్టు నెలనే. కాలేజీలు తెరుచుకుని కాస్త హడావుడి ముగిశాక స్టూడెంట్స్ అందరూ సినిమాల మీద మళ్లీ ఫోకస్ పెట్టేది ఆగస్టులోనే. నెల మధ్యలో స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కాబట్టి దానికి ముందు వీకెండ్లో పెద్ద సినిమాల్ని షెడ్యూల్ చేస్తుంటారు.

ఈ ఏడాది ఆ వీకెండ్లో ఎన్టీఆర్-బాబీల కొత్త సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ప్రారంభోత్సవానికి ముందే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ సినిమా అనుకున్న సమయానికి ఆరంభం కాకపోవడం.. అనుకున్న ప్రకారం సినిమా పూర్తయ్యేలా లేకపోవడంతో ముందే డ్రాప్ అయిపోయారు. ఐతే ఎన్టీఆర్ సినిమా ఆ తేదీకి రాదని తెలియగానే.. నితిన్ కర్చీఫ్ వేసేశాడు.

హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘లై’ మూవీ ఆగస్టు 11నే రాబోతోంది. ఈ రోజు మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి హిట్ తర్వాత హను.. ‘అఆ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ నటించిన సినిమా కావడంతో ‘లై’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా ఈ రోజు వచ్చిన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న 14 రీల్స్ సంస్థ స్థాయి ఏంటో తెలిసిందే కాబట్టి ఓ స్టార్ హీరో సినిమా లాగే దీన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు. ప్రమోషన్ కొంచెం గట్టిగానే చేస్తారట. ఈ చిత్రానికి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్నందిస్తుండటం విశేషం. మోషన్ పోస్టర్‌కు ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.