భారీ ధరకు రాధేశ్యామ్ హిందీ థియేట్రికల్ రైట్స్..?

టాలీవుడ్ టు పాన్ ఇండియా స్టార్ గా మారిన డార్లింగ్ ప్రభాస్ సినిమాల గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉండటం విశేషం. అయితే తాజాగా రాధేశ్యామ్ షెడ్యూల్ అనేసరికి ఫ్యాన్స్ అంతా ఇంకా సినిమా పూర్తి కాలేదా అంటూ నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే కేవలం రిలీజ్ మాత్రమే మిగిలి ఉందని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇంకా షెడ్యూల్ షూటింగ్ ఉందంటే అంటూ ఆలోచనలో పడ్డారు.

ఇదిలా ఉండగా.. రాధేశ్యామ్ మాత్రం పీరియడిక్ లవ్ డ్రామా అనేది తెలిసిన విషయమే. 1970ల కాలంనాటి ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తోంది. అయితే జులై 30న రాధేశ్యామ్ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితి చూస్తుంటే సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదని అర్ధమవుతుంది. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. అసలే ఏడాదిగా వెయిట్ చేస్తున్నటువంటి రాధేశ్యామ్ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశలో ఉన్నాయట.

ఈ సినిమాను రాధాకృష్ణకుమార్ తెరకెక్కించగా.. యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటంటే.. రాధేశ్యామ్ హిందీ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓవర్సిస్ డీల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ఓటిటి డీల్స్ జరుగుతున్నాయట. టాలీవుడ్ తో పాటు ప్రభాస్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన విషయం తెలిసిందే. సాహో సినిమాతో ప్రభాస్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ సినిమా థియేట్రికల్ హక్కులు 110 – 120కోట్లు వరకు ధర పలికినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి అసలు విషయం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. అయితే ప్రస్తుతం రాధేశ్యామ్ తో పాటు సలార్ – ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.