టికెట్ రేట్ల ఫైల్ పై సీఎం సంతకం.. ‘రాధేశ్యామ్’ కు లాభం చేకూరేనా..?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం మీద గత 11 నెలలుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రేట్లు నియంత్రిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ అసహనం వ్యక్తం చేయడం.. సినీ పెద్దలు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడం.. ఈ క్రమంలో ఏపీ సర్కారు ఓ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

ఇటీవల కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫిబ్రవరి 24న టికెట్ రేట్ల సవరణ జీవో రావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ టికెట్ ధరల పెంపు ఫైల్ మీద సంతకం చేశారని తెలుస్తోంది.

సినిమా టిక్కెట్ ధరల అంశం మీద ఈరోజో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానానికి సమాచారం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేస్తారని అనుకుంటున్నారు.

ఇదే కనుక నిజమైతే సినీ ఇండస్ట్రీకి.. రానున్న రోజుల్లో విడుదలకు సిద్ధమైన భారీ చిత్రాలకు శుభ పరిణామమనే చెప్పాలి. ఏపీ సర్కారు జీవో ఈ రెండు రోజుల్లో వస్తే ముందుగా మార్చి 11న రిలీజ్ కాబోతోన్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి హెల్ప్ అవుతుంది.

తాజాగా ‘రాధేశ్యామ్’ మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ కి ఇదే విషయం మీద ప్రశ్న ఎదురైంది. ఏపీ సర్కారు మీ సినిమా టికెట్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది అని ప్రశ్నించగా.. ”ఈ విషయలాన్ని మా నిర్మాతలు వంశీ – ప్రమోద్ చూసుకుంటున్నారు. అది వారినే అడగాలి” అని ప్రభాస్ సమాధానమిచ్చారు.

ఇటీవల మీరు కూడా జగన్ ని కలిశారు కదా.. ఏం అనుకుంటున్నారు? అని అడగగా.. ‘మంచి జరగాలనే కోరుకుంటున్నాం.. వస్తే బావుంటుంది’ అంటూ ప్రభాస్ బదులిచ్చారు. ఇకపోతే టికెట్ రేట్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దర్శక నిర్మాతలు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో చిరంజీవి – మహేష్ బాబు – ప్రభాస్ వంటి సినీ ప్రముఖులు జగన్ తో భేటీ అయిన సమయంలో పెద్ద సినిమాలు – 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు ఎక్కువ రేట్లు టికెట్లు అమ్ముకునే విధానం పరిశీలిస్తున్నామని జగన్ స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఏదైనా కల్పించాలని ‘రాధేశ్యామ్’ మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది. మరి రిలీజ్ లోపు ఏపీ సర్కారు జీవో జారీ చేసి ప్రభాస్ చిత్రానికి సపోర్ట్ చేస్తుందేమో చూడాలి.