ఎన్టీఆర్ తో కంటే చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు చేశాను: రాఘవేంద్రరావు

పాతికేళ్ల క్రితం వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాతో రాఘవేంద్రరావు ఇండస్ట్రీకి హిట్ ఇచ్చారు. ఆ సినిమాతో శ్రీకాంత్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు అదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు చేసిన ‘పెళ్లి సందD’ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవేంద్రరావు మాట్లాడారు.

“ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ అంటే .. రాఘవేంద్రరావు – కృష్ణమోహన్ రావు అని మా బ్రదర్ పేరుతో పెట్టాను. ఈ బ్యానర్లో చిరంజీవి గారు .. వెంకటేశ్ గారు కూడా సినిమాలు చేశారు. ఈ బ్యానర్ అంటే నాకంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. ఈ బ్యానర్ పై 12 సినిమాలు చేశాము. ‘బాహుబలి’ సినిమాలో రాఘవేంద్రరావు ప్రెజెంట్స్ అని వేయడం జరిగింది. నాకెందుకో నా బ్రదర్ పేరుతో ఒక సినిమా చేయాలని అనిపించింది. కానీ కరోనా వలన కుదరలేదు. ‘పెళ్లి సందD’లో ఒక పాట మాత్రం ‘ల్యాప్ ట్యాప్’లో చూపించాను.

ఆయన ఒక చిన్నపిల్లాడిగా చప్పట్లు కొట్టారు .. ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. “అన్నయ్యా నాన్న గారు హీరో కావాలని వచ్చి డైరెక్టర్ అయ్యారు .. నేను ఇప్పుడు ఆర్టిస్టుగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాకి నువ్వు నిర్మాతవు గనుక నీ చేత్తో రెమ్యునరేషన్ చెక్ ఇవ్వమంటే తను సంతకం చేసి ఇచ్ఛాడు .. అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది. ఆయన సంతకం గుండెల్లో ఉండాలని అలాగే ఉంచాను. అనారోగ్య కారణాల వలన ఆయన ఈ సినిమా చూడకుండానే కాలం చేశారు. ఆయన కోసం అందరం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం..

ఇక ఈ సినిమా విషయానికి వస్తే .. నాకు ఎప్పుడూ కూడా వేషం వేయాలని లేదు. వెంకటేశ్ కూడా ఒకసారి అడిగాడు .. దిల్ రాజు గారు కూడా అడిగారు .. కానీ చేయలేదు. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి సరదాగా ఒక వేషం వేద్దామని వేశాను .. అలాగని చెప్పేసి ఎక్కువ ఆశించవద్దు. ఈ వేషం ఎవరికి చెప్పినా వాళ్లు చేయనంటారు .. ఏవుంది ఇందులో చేయడానికి? అని . ఎవరూ చేయలేనిదే మనం చేయాలని అలా డిసైడ్ అయ్యానంతే. నా పక్కన రాజేంద్రప్రసాద్ ఉండబట్టి కాస్త మేనేజ్ చేస్తూ మొదలుపెట్టాను.

కొత్త హీరోను .. కొత్త హీరోయిన్ ను పరిచయం చేయడంలోని ఆనందం ఎప్పటికీ ఉంటుంది. వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేశాను. ఆ పేరును ఆయన నిలబెట్టాడు .. అందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇక చిరంజీవిని నేను బాబాయ్ అని పిలుస్తుంటాను. ఆయన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ముందుగా నన్నే పిలుస్తాడు .. మా ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఆయననే ముందుగా పిలుస్తాను. అలాంటి అనుబంధం మా మధ్య ఉంది. అంతేకాదు .. ఎన్టీఆర్ తో నేను 12 సినిమాలు చేస్తే చిరంజీవితో 14 సినిమాలు తీశాను. వచ్చే యంగ్ స్టర్స్ కంటే కూడా ఆయన స్పీడ్ గా వెళుతూనే ఉంటాడు. కొత్త హీరోలు ఆయనను ఫాలో అవుతూనే ఉంటారు. రోజు రోజుకి ఆయన .. నాగార్జున తమ పిల్లలకి కూడా అపోజిషన్ గా వచ్చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.