కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఓ లేఖ రాశారు. ఇప్పటికే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో చర్చించి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేశారని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంటర్ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతోపాటు దాదాపు 20 రాష్ట్రాల విద్యాబోర్డులు తమ రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశాయన్నారు. కానీ ఏపీ మాత్రం పరీక్షలు నిర్వహించాలని భావించడం ద్వారా 5 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులు కరోనా బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో విద్యాశాఖ మంత్రి చెప్పాలన్నారు. పిల్లలు ఎలాంటి వైరస్ లకైనా త్వరగా ప్రభావితం అవుతారని చెప్పారు. వెంటనే రాష్ట్రంలో పరీక్షలు రద్దుచేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట కల్పించాలని సూచించారు.