ఇద్దరు వ్యాపారవేత్తల కోసమే మోదీ నిర్ణయాలు: రాహుల్ గాంధీ

‘ప్రతిపక్షాలు రైతులు చేస్తున్న ఆందోళన గురించే మాట్లాడుతున్నాయి కానీ.. చట్టంలో ఏముందో మాత్రం మాట్లాడటం లేద’న్న ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘చట్టాల్లో ఏముందో మాట్లాడి ప్రధానిని సంతృప్తి పరుస్తా’ అన్నారు. దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చని చట్టంలో ఉంది. దీంతో మండీకి వచ్చేవారు ఎవరుంటారు? మండీలను మట్టుబెట్టడానికే చట్టాలు తెచ్చారు. పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు ఆహార ధాన్యాలను, పండ్లను, కూరగాయలను కావలసినంతగా నిల్వ చేసుకోవచ్చని చట్టంలో ఉంది. ఇది నిత్యావసర వస్తువుల చట్టానికి తూట్లుపొడవటమే’ అన్నారు.

లోక్‌సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర నిర్ణయంపై ఈ విధంగా మండిపడ్డారు. రైతులు చేస్తున్నది ఉద్యమం కాదని.. ఇది దేశానికి చెందిన ఉద్యమం అన్నారు. రైతులు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఇద్దరు వ్యాపార వేత్తలకు పెద్ద పీట వేయడం వల్లే దేశాభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాల కల్పన ఉండడం లేదని అన్నారు.