మన్మధుడు దర్శకుడి వెబ్‌ జర్నీ

అందాల రాక్షసి చిత్రంతో హీరోగా నటించి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటుడిగా నటించి, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులను అలరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. నటుడిగా ఎన్ని సినిమాలు చేసినా కూడా స్టార్‌డం రాకపోవడంతో డైరెక్టర్‌గా మారిన విషయం తెల్సిందే. మొదటి సినిమా చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ రెండవ సినిమాగా మన్మధుడు 2 చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే.

నాగార్జున హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడినది. ఆ సినిమాపై నాగార్జునతో పాటు అక్కినేని ఫ్యాన్స్‌ చాలా నమ్మకం పెట్టుకున్నారు. మన్మధుడు హిట్‌ అవ్వడంతో మన్మధుడు 2 పై పెరిగిన అంచనాలను వారు అందుకోవడంలో విఫలం అయ్యారు. ఆ సినిమా హిట్‌ అయితే వెంటనే నాగచైతన్య హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో సినిమా అనుకున్నారు. కాని రాహుల్‌తో సినిమాకు ఇప్పుడు ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు.

సినిమా ఛాన్స్‌ు రాకపోవడంతో రాహుల్‌ రవీంద్రన్‌ వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ కోసం వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించి ఇచ్చేందుకు రాహుల్‌ ఒప్పందం చేసుకున్నాడట. త్వరలోనే వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన వర్క్‌ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతా కూడా ఓటీటీ జనరేషన్‌. కనుక వెబ్‌ సిరీస్‌లపై ప్రముఖ దర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. నటుడిగా, దర్శకుడిగా సక్సెస్‌ దక్కించుకోలేక పోయిన రాహుల్‌ వెబ్‌ సిరీస్‌లతో అయినా మంచి పేరు దక్కించుకుంటాడేమో చూడాలి.