‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ పై ఇప్పట్లో క్లారిటీ వచ్చేనా..?

మలయాళంలో సూపర్ హిట్ అయిన ”డ్రైవింగ్ లైసెన్స్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పృథ్వీరాజ్ – సూరజ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ చిత్రం అక్కడ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి రైట్స్ కోసం పోటీ పడ్డారు. తెలుగు రీమేక్ విషయానికొస్తే హీరో రామ్ చరణ్ దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మలయాళ మేకర్స్ నుంచి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు రీమేక్ రైట్స్ కొనుగోలు చేయగా.. వారి దగ్గర నుంచి చరణ్ ఈ హక్కులు తీసుకున్నాడని టాక్ ఉంది.

పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ హీరోలుగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇప్పుడు లేటెస్టుగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒక హీరో మరియు అతన్ని అభిమానించే ఓ బ్రేక్ ఇన్ స్పెక్టర్ మధ్య అనుకోని పరిస్థితుల వల్ల ఏర్పడిన గొడవ నేపథ్యంలో మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా రూపొందింది. అయితే తెలుగులో వెంకీతో బ్రేక్ ఇన్ స్పెక్టర్ క్యారెక్టర్ వేయించాలని చెర్రీ ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడట. ఇక మిగిలిన హీరో పాత్రలో తాను లేదా ఎవరైనా స్టార్ హీరోతో నటింపజేయాలనేది చరణ్ ఆలోచనట.

అయితే ఇప్పుడు చరణ్ ఫుల్ బిజీగా ఉండటం.. ఆ హీరో క్యారెక్టర్ పోషించడానికి టాలీవుడ్ హీరోలెవరు ఒప్పుకోకపోవడంతో.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోల పై చరణ్ కన్ను పడినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకోసం చెర్రీ తన స్నేహితుడు రానా దగ్గుబాటి సహాయం తీసుకుంటున్నాడట. దీంతో ఇప్పుడు ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ కాంపౌండ్ లోకి వెళ్లిపోయిందని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. ఇన్ని పరిణామాల మధ్య చివరకు ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఏ హీరోల చేతిలోకి వెళ్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.