తారక్, చరణ్ ఇళ్లలో స్టూడియో సెటప్స్

ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కొత్త టార్గెట్‌ను అందుకోవడానికి పక్కాగా షెడ్యూల్స్ వేసుకుని రంగంలోకి దిగిన రాజమౌళి బృందానికి కరోనా మహమ్మారి బ్రేక్ వేసింది. నెల కిందటే షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు పని మొదలవుతుందో తెలియదు. అలాగని ఈ ఖాళీ సమయాన్ని వృథాగా వదిలేయట్లేదు చిత్ర బృందం.

ఇప్పటిదాకా చిత్రీకరణ పూర్తయినంత మేర ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గత నెలలో చరణ్ పుట్టిన రోజుకు రిలీజ్ చేసిన వీడియోకు తారక్ డబ్బింగ్ స్టూడియోకు రాకుండానే.. ఆన్ లైన్ ద్వారా డబ్బింగ్ చెప్పినట్లు సంగీత దర్శకుడు కీరవాణి చెప్పిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ విషయంలో తారక్, రాజమౌళి, కీరవాణి, తమిళ రచయిత మదన్ కార్కీ కలిసి ఓ వీడియో కాల్ మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే డబ్బింగ్ స్టూడియోల్లో ఉండే ఏర్పాట్లు, ఆ క్వాలిటీ వేరు. మరి టీజర్ వరకైతే ఎలాగోలా మేనేజ్ చేశారు కానీ.. సినిమాలో అన్ని సన్నివేశాలకూ ఇలాగే ఇంటిపట్టున ఉండి డబ్బింగ్ చెప్పడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు విషయంలో ఇలా చేస్తే క్వాలిటీ దెబ్బ తింటుందేమో అన్న సందేహాలూ ఉన్నాయి.

ఐతే విశ్వసనీయ సమాచారం ప్రకారం క్వాలిటీ విషయంలో ఇబ్బంది రాకుండా తారక్, చరణ్ ఇళ్లలో ఒక్కో గదిని డబ్బింగ్ కోసం తీర్చిదిద్దుకున్నారట. సౌండ్ ప్రూఫ్ డిజైనింగ్ చేయించి.. స్టూడియో ఎఫెక్ట్ వచ్చేలా మార్పులు చేశారట. వారికి టాప్ క్వాలిటీ మైక్‌లు పంపించిన రాజమౌళి.. స్టూడియో క్వాలిటీతో డబ్బింగ్ వచ్చేలా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారట.

జూమ్ యాప్ ద్వారా తారక్, చరణ్‌లతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు డబ్బింగ్‌ను పర్యవేక్షిస్తూ ఔట్ పుట్ తీసుకుంటున్నారని.. కాబట్టి క్వాలిటీ విషయంలో సమస్య తలెత్తే అవకాశమే లేదని అంటున్నారు.