ముంబైలో విలువైన సమయం సోదరితోనే!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షెడ్యూల్ బ్రేక్ లో ఉన్నారు. డిసెంబర్ అంతా `ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్స్ లో బిజీ అయిన చరణ్ ఆకస్మికంగా రిలీజ్ వాయిదా పడటంతో కొంత నిరాశపడ్డారు. అయితే అప్పటివరకూ ఊపిరి తీసుకోకుండా ప్రచారం కోసం శ్రమించిన చరణ్ కి ఒక్కసారిగా కావాల్సినంత తీరిక సమయం చిక్కింది. అలాగే శంకర్ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా తాత్కాలికంగా వాయిదా పడటంతో చరణ్ షూటింగ్ అనే థాట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు. స్నేహితుల్ని కలవడం.. ముఖ్యమైన సినిమా ఈవెంట్లు ఉంటే హాజరవ్వడం తప్ప చరణ్ షెడ్యూల్ ఇప్పుడేమంత బిజీగా లేదు.

తాజాగా చరణ్ తన సోదరి శ్రీజతో కలిసి ముంబై వెళ్లినప్పటివి కొన్ని ఫోటోలు ఎయిర్ పోర్ట్ నుంచి లీక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీజ తన సోదరుడు చరణ్ తో కలిసి పనిమీద వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే చరణ్ ఇలా సోదరితో హైదరాబాద్ సిటీ దాటి వెళ్లడం ఇదే మొదటిసారి. ఇద్దరు కలిసి విదేశీ ప్రయాణాలు చేసిన సందర్భాలు కూడా అరుదు. బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ కి మాత్రం సంక్రాంతి సమయంలో కుటుంబమంతా కలిసి వెళ్తారు. ఆ సమయంలోనే శ్రీజ బయట కనిపిస్తారు. ఇప్పుడిలా శ్రీజతో చరణ్ ముంబై వెళ్లారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

చరణ్ సినిమాల విషయానికి వస్తే.. తదుపరి ఏ దర్శకుడితో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తారు? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత చరణ్ పాన్ ఇండియా అప్పీల్ ఉండే చిత్రాలే చేస్తారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనిలో భాగంగా `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈలోపు శంకర్ `ఇండియన్-2`ని పూర్తిచేస్తే బ్రేక్ పడిన ప్రాజెక్ట్ ని చరణ్ ముందుకు తీసుకెళ్తారని తెలుస్తోంది.