ఆ సినిమా ఆగిపోలేదట

అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చి.. ‘పెళ్ళిచూపులు’ సినిమాలో హీరోయిన్ అవతారమెత్తి వావ్ అనిపించిన తెలుగమ్మాయి రీతూ వర్మ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టవడం, రీతూకు కూడా మంచి పేరు రావడంతో ఆమె కెరీర్ దశ తిరిగినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా తర్వాత రీతూకు పెద్దగా అవకాశాలు రాలేదు. ‘కేశవ’ లాంటి కొంచెం క్రేజ్ ఉన్న సినిమానే చేసింది కానీ.. అది అంత మంచి ఫలితాన్నివ్వలేదు.

ఇంతలో తమిళం నుంచి మంచి అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్లిపోయింది రీతూ. తాజాగా ఆమె దుల్కర్ సల్మాన్‌తో చేసిన సినిమా తమిళంలో సూపర్ హిట్టయింది. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. సరైన ప్రచారం లేక వెనుకబడిపోయింది. ఐతే ఇప్పటిదాకా తెలుగులో తన కెరీర్ ఎలా ఉన్నా.. ఇక ముందు మాత్రం పుంజుకుంటుందని అంటోంది రీతూ.

ప్రస్తుతం తెలుగులో తాను మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. నాగశౌర్య సరసన రీతూ హీరోయిన్‌గా సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు ఆ మధ్య ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే స్క్రిప్టు విషయంలో అసంతృప్తితో ఈ సినిమాను శౌర్య ఆపేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం అబద్ధమని రీతూ స్పష్టం చేసింది.

లాక్ డౌన్ వల్లే ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదని.. పరిస్థితులు కుదురుకున్నాక సినిమా పట్టాలెక్కుతుందని.. ఈ మధ్యే తాను దర్శకురాలితో కూడా మాట్లాడానని.. ఇదొక అందమైన లవ్ స్టోరీ అని రీతూ ఓ ఇంటర్వ్యలో చెప్పింది. మరోవైపు నాని సరసన ‘టక్ జగదీష్’లో నటిస్తున్నానని.. నాని కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చేశానని.. అవి భలే వచ్చాయని రీతూ చెప్పింది. ఇది కాక శర్వానంద్ నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కూడా తనే కథానాయికనని రీతూ వెల్లడించింది.