‘RRR’ సత్తా అప్పుడు కాదు..ఇప్పుడు చూపించాలి!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల్లోనే సినిమా ‘బాహుబలి ది బిగినింగ్’ రికార్డులను 750 కోట్ల వసూళ్లతో బ్రేక్ చేసింది. నైజాం రికార్డులైతే తొలిరోజే పటా పంచల్ చేసింది. ఒక్క నార్త్ మినహా అన్ని ఏరియాల్లో ‘ఆర్ ఆర్ ఆర్’ భారీ వసూళ్లనే సాధించింది.

ఇక తెలుగు రాష్ర్టాల్లో అయితే పది రోజులపాటు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులు బాటుతో పాటు..ఐదవ షోకి అనుమతి ఉండటంతో ‘ఆర్ ఆర్ ఆర్’ దూకుడు కొనసాగించింది. గ్రాస్ వసూళ్లలో తెలుగు రాష్ర్టాల వసూళ్లు కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. పది రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ ఆర్ ఆర్’ దందా కొనసాగింది.

సాధారణ ధరకన్నా టిక్కెట్ కి అదనంగా వసూల్ చేయడంతోనే భారీ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో సినిమా కేవలం ఓ వర్గం ఆడియన్స్ కే పరిమితమైంది. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 400 నుంచి 450 రూపాయల వరకు వసూల్ చేసారు. ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి. భారీ బడ్జెట్ సినిమా కావడంతోనే ప్రత్యేక మినహాయింపు దక్కింది. దీంతో మొదటి మూడు రోజుల పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ కి భారీ వసూళ్లు వచ్చాయి.

ఆ తర్వాత కాస్త వేగం తగ్గింది. మళ్లీ ఉగాది..ఆ మరుసటి రోజు పండుగ దినాలు కావడంతో వేగం పుంచుకుంది. అయితే పెరిగిన ధరలతో మధ్య తరగతి కుటుంబాలకు ‘ఆర్ ఆర్ ఆర్’ ఇంత కాలం దూరమైందననే చెప్పాలి. అయితే నిన్నటితో పది రోజుల గడువు ముగిసింది. నేటి నుంచి మళ్లీ పాత ధరలకే టిక్కెట్లు విక్రయించాల్సి ఉంది. తెలంగాణాలో సింగిల్ స్ర్కీన్ కి 175 రూపాయలు.. మల్టీప్లెక్సుల్లో 290 రూపాయాలు గరిష్టంగా ఉంది.

ఏపీలో సింగిల్ స్ర్కీన్ కి 145 రూపాయలు కాగా.. మల్టీప్లెక్స్ ల్లో 177 రూపాయలు గరిష్టంగా ఉంది. నేటి నుంచి రెండు రాష్ర్టాల్లో ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. రీక్లెయినర్ సీట్లు వీటికి మినహాయింపు ఉంటుంది. అంటే ఈరోజు నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ టార్గెట్ మరో వర్గం అని చెప్పొచ్చు. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ టిక్కెట్ ధర తెలుసుకుని వెనకడుగు వేసిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. ధర తగ్గిన తర్వాత చూద్దామని ..రోజులు గడిచే కొద్ది లైట్ అనే సీన్ లోకి మరికొంత మంది వచ్చేసారు.

మరి సినిమా రిలీజ్ అయి 10 రోజులు గడిచిపోయింది కాబట్టి ఇప్పుడంత ఎగ్జైట్ మెంట్ ఉంటుందా? అన్నది సందేహమే. నిజానికి ‘ఆర్ ఆర్ ఆర్’ డే 11 నుంచి నిరూపించాలి. తగ్గిన టిక్కెట్ ధరలతో థియేటర్ ఆక్యుపెన్సీ ఉంటేనే దాన్ని బ్లాక్ బస్టర్ గా చెప్పాల్సి ఉంటుంది. ‘అఖండ’ సినిమాకి ఆడియన్స్ ట్రాక్టర్లపై ..ఎండ్ల బళ్లపై తరలి వచ్చిన సన్నివేశం ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా ప్రూవ్ చేయాలి.