క‌రోనా విరాళం.. స‌ల్మాన్ లెక్క తేలింది

క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్న వారిని ఆదుకునేందుకు ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ నిధికి ఏకంగా రూ.25 కోట్ల విరాళం అందించి ఔరా అనిపించాడు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్. దానికి తోడు ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు కూడా రూ.3 కోట్ల విరాళం అందించాడు. బాలీవుడ్లో అక్ష‌య్‌ను మించిన సూప‌ర్ స్టార్లున్నారు. వాళ్లు విరాళాలిచ్చే విష‌యంలో అక్ష‌య్‌కు ఏమాత్రం దీటుగా నిలుస్తారో చూడాల‌ని జ‌నాలు ఎదురు చూస్తున్నారు.

ఐతే మిగ‌తా వాళ్ల సంగ‌తేమో కానీ.. స‌ల్మాన్ ఖాన్ మాత్రం త‌న వంతుగా భారీ సాయ‌మే అందించాడు. అత‌ను రూ.15 కోట్ల ఆర్థిక సాయాన్ని సినీ కార్మికుల‌కు అంద‌జేశారు. బాలీవుడ్ సినిమాల‌కు ప‌ని చేసే 25 వేల మంది కార్మికుల అకౌంట్ల‌లోకి డ‌బ్బులు వేయ‌నున్న‌ట్లు స‌ల్మాన్ ఇంత‌కుముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తొలి నెల వారికి రూ.3 వేలు అందించిన స‌ల్మాన్.. రెండో నెల‌కు కూడా నిధులు విడుద‌ల చేశాడ‌ట‌. అంటే 25 వేల మందికి ఇప్ప‌టిదాకా త‌లో రూ.6 వేల చొప్పున అందాయ‌న్న మాట‌. ఇలా మొత్తం స‌ల్మాన్ నుంచి రూ.15 కోట్ల సాయం అందిన‌ట్లు ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అధ్య‌క్షుడు అశోక్ దూబె వెల్ల‌డించాడు.

క‌రోనా ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న దాన్ని బ‌ట్టి త‌ర్వాతి నెల‌కు కూడా ఇదే త‌ర‌హాలో సాయం అందించ‌డానికి స‌ల్మాన్ సిద్ధ‌ప‌డుతున్నాడు. అంటే స‌ల్మాన్ ఇంకో రూ.7.5 కోట్లు అందించే అవ‌కాశ‌ముంది. ఆ త‌ర్వాత ఎలాగూ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని.. ఈలోపే షూటింగ్‌లు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌ని భావిస్తున్నారు. మ‌రో సూప‌ర్ స్టార్ షారుఖ్ ఖాన్ త‌న ఆఫీసుని ఆసుప‌త్రిగా మార్చుకునే అవ‌కాశం ఇవ్వ‌డ‌మే కాక‌.. వైద్యుల ర‌క్ష‌ణ కోసం 25 వేల పీపీఈ కిట్లు స‌మ‌కూర్చాడు.