సోనూసూద్ పై విమర్శలా.. శివసేనా నీకిది తగునా?

సోనూసూద్.. మన తెలుగువాళ్లకు కూడా పరిచయం అక్కర్లేని పేరు. వదల బొమ్మాళీ వదల అంటూ అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. విలన్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందిన సోనూ.. తాజాగా తన ఔదార్యంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి అండగా నిలిచి ప్రశంసలు పొందుతున్నాడు.

తన విలాసవంతమైన హోటల్ ను వైద్య సిబ్బంది, పోలీసులు ఉపయోగించుకోవడానికి ఇచ్చేశాడు. కార్మికుల కన్నీటి గాథలు విని చలించిపోయి.. వారిని తన సొంత ఖర్చుతో ఊళ్లకు తరలించాడు. పలువురిని బస్సులో తరలించగా.. కొంతమందిని ఏకంగా విమానంలో పంపించాడు. దీంతో సోనూ చేస్తున్న కార్యక్రమాలకు జనాలు ఫిదా అయిపోయారు. అతడిపై ప్రశంసలు కురిపించారు. జాతీయ ఛానళ్లు సహా మీడియా అంతా ఆయన చేస్తున్న సేవలను ప్రముఖంగా ప్రసారం చేసింది. తనకు సాయం చేసే సత్తా ఉన్నంత వరకు ఈ కార్యక్రమాలు చేస్తానని సోనూ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాడు.

నిజానికి ప్రభుత్వాలు సైతం చేయలేని పనిని సోనూ చేయడం ద్వారా ఎంతోమందికి హీరో అయ్యాడు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న సోనూని ఎవరైనా అభినందించాల్సిందే. కానీ శివసేన తీరే వేరు. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో శివసేన నేత సంజయ్ రౌత్.. సోనూసూద్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త మహాత్ముడు వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. లాక్ డౌన్ వేళ అతడికి బస్సులెలా దొరికాయని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరో రాజకీయ దర్శకుడు ఉండే ఉంటాడు అంటూ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోనూ చేస్తున్న మంచి పనిని ప్రశంసించకపోయినా పర్లేదు.. కానీ ఈ విమర్శలేంటి అని ఏకిపారేస్తున్నారు. వాస్తవానికి కరోనా కట్టడిలో శివసేన పూర్తి విఫలమైంది. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతుండటమే ఇందుకు నిదర్శనం.

బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన చెట్టపట్టాలు వేసుకుని సీఎం పీఠం అధిరోహించిన ఉద్ధవ్ ఠాక్రే.. మహారాష్ట్రలో కరోనా నివారణకు సరైన చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. దేశంలో 2.46 లక్షల కేసులు ఉండగా.. వాటిలో దాదాపు 83వేల కేసులు మహారాష్ట్రవే. అలాగే దేశంలో దాదాపు 7వేల మరణాలు సంభవించగా.. 3వేలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా.. వలస కార్మికులకు సాయం చేస్తున్న సోనూపై రాజకీయపరమైన విమర్శలు చేయడం శివసేనకు తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share