ఆ దృశ్యం కలచి వేసింది.. త్వరలో వృద్ధాశ్రమం నిర్మిస్తా: థమన్

అతిత్వరలో తాను ఒక ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తానని మ్యూజిక్ డైరక్టర్ థమన్ అన్నారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాన్ని కూడా థమన్ ట్విట్టర్లో వివరించారు. తమిళనాడులోని ఒక ప్రాంతంలో.. ఓ వృద్ధురాలు రోడ్డుపై కూర్చుని దీనావస్థలో అన్నార్తుల కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెకు వాటర్ బాటిల్, ఆహారం అందించాడు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసి తన చీర కొంగులో దాచుకున్న డబ్బును ఇవ్వబోయింది. ఆ వ్యక్తి అందుకు తిరస్కరించాడు.

ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన థమన్ స్పందించాడు. ‘ఈరోజు ఈ వీడియో నాలో కొత్త ఆలోచన రేకెత్తించింది. వీడియోలో బామ్మను చూసిన తర్వాత నా మనసు నిర్వేదంతో నిండిపోయింది. ఎటువంటి అండా లేని నిరాశ్రయులైన వృద్ధుల కోసం అతి త్వరలోనే ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తాను’ అని రీట్వీట్ చేశాడు. దీంతో థమన్ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.