థియేటర్లు ఓపెన్ అయినా.. ముందులా ఉండదు

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి కొన్ని నెలల ముందు నుంచే దయనీయంగా తయారైంది. ఫిబ్రవరి నుంచి సరైన సినిమాలు పడక థియేటర్లు వెలవెలబోతూ కనిపించాయి. ఇంతలో కరోనా మహమ్మారి వచ్చి పడింది. థియేటర్లు మూతపడిపోయాయి. బంగారం లాంటి వేసవి సీజన్ వేస్టయిపోతోంది. ఏప్రిల్ నెలలో థియేటర్లు తెరుచుకునే అవకాశం దాదాపు లేనట్లే.

మే మొదటి వారం నుంచి మళ్లీ థియేటర్లలో సిినిమాలు ఆడుతాయని భావిస్తున్నారు. కానీ ఒకవేళ థియేటర్లు పున:ప్రారంభమైనప్పటికీ కొంత కాలం పాటు అక్కడ సాధారణ పరిస్థితులు కనిపించకపోవచ్చు. జనాలు థియేటర్లు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు.

ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు చేపట్టడం ద్వారా థియేటర్లు కూడా సురక్షితమే అన్న సంకేతాలు ఇవ్వాల్సి ఉంది. కూరగాయల కోసం రైతు బజార్‌కు, సరకుల కోసం కిరాణాకు వెళ్లినట్లు థియేటర్లకు జనాలు వచ్చేలా చేయాలని యాజమాన్యాలు కొన్ని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

థియేటర్లలో సీటింగ్‌ విషయంలో కొంత కాలం పాటు కొన్ని నిబంధనలు పాటించబోతున్నారట. ఒక సీటు ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఇంకో సీటు ఖాళీగా విడిచిపెట్టి తర్వాతి సీటులో ఇంకో వ్యక్తిని కూర్చోబెట్టాలా షరతులు విధించనున్నారట. అంటే పూర్తి కెపాసిటీలో సగంతోనే థియేటర్‌ను నింపేసి షోలు నడిపించబోతున్నారు.

ఇలా చేస్తే తప్ప ప్రభుత్వాలు థియేటర్లు నడపడానికి త్వరగా అనుమతులు ఇవ్వకపోవచ్చని.. అలాగే జనాలు కూడా థియేటర్లకు రావాలంటే ఇలా చేయాల్సిందే అని యాజమాన్యాలు భావిస్తున్నట్లు సమాచారం.

అలాగే మల్టీప్లెక్సుల్లో ఒక స్క్రీన్‌కు, ఇంకో స్క్రీన్‌కు షోల టైమింగ్‌లో తేడా ఉండేలా చూడటం ద్వారా కెఫటేరియాల్లో జనాల సందడి లేకుండా చూడాలని.. అలాగే శానిటైజర్లు పెట్టడం.. నిరంతరం పరిసరాల్ని శానిటైజేషన్ చేయడం.. ఎంట్రన్స్ దగ్గర థర్మామీటర్లు పెట్టి ప్రేక్షకుల టెంపరేచర్ చెక్ చేయడం లాంటి చర్యలతో జనాలు థియేటర్లకు వచ్చేలా భరోసా ఇవ్వాలని.. ఇలా కొన్ని వారాలు, నెలలు స్ట్రిక్టుగా ఉండి.. సాధారణ పరిస్థితులు వచ్చాక సడలించవచ్చని.. ఇలా చేస్తే తప్ప జనాల్ని మళ్లీ థియేటర్లకు రప్పించలేమని యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.