‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ట్రైలర్: విజువల్ వండర్ గా GOT ప్రీక్వెల్..! Trailer-Talk-Intense-Dramatic-House-Of-Dragons-Arriving


ప్రపంచంవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న టీవీ షోలలో ”గేమ్ ఆఫ్ థ్రోన్స్” ఒకటి. హెచ్బీవో(HBO) నిర్మించిన ఈ సిరీస్ కు ఇండియాలోనూ చాలా మంది అభిమానులున్నారు. 2011 – 2019 మధ్య కాలంలో ఎనిమిది సీజన్స్ లో 73 ఎపిసోడ్స్ గా ప్రసారం చేయబడిన ఈ షో విశేష ఆదరణ దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ – అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ ఓటీటీలలో ఎన్నో వెబ్ సిరీస్ లు వచ్చినప్పటికీ.. ‘GOT’ సిరీస్ ను బీట్ చేయలేకపోయాయి.

అయితే ఎనిమిది సీజన్స్ తర్వాత ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ షోను ముగించడంతో ఈ సిరీస్ ను అభిమానించే వారు అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో హెచ్బీవో ఛానల్ ఇప్పుడు GOT ప్రీక్వెల్ తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ”హౌస్ ఆఫ్ ది డ్రాగన్” అనే పేరుతో రాబోతున్న ఈ షోకు సంబంధించిన వివరాలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి.

‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ షోను ఆగస్టు 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు హెచ్బీవో మాక్స్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆసక్తిని కలిగించగా.. లేటెస్టుగా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’ కు రెండు వందల ఏళ్లకు పూర్వం జరిగిన కథతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

యాక్షన్ సీన్స్ – ఆసక్తికరమైన పాత్రలు – అద్భుతమైన విజువల్స్ మరియు భయానకమైన డ్రాగన్ లతో కూడిన “హౌస్ ఆఫ్ ది డ్రాగన్” ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పాలి. పాత్రధారుల గెటప్స్ మొదలు సెట్స్ అన్నీ కూడా GOT ను గుర్తు చేస్తూనే ఉంటాయి. యువరాణి రెనిరా టార్గారియన్ మరియు అలిసెంట్ హైటవర్ పాత్రలు ఆకట్టుకుంటున్నాయి.

ఐరన్ థ్రోన్ మరియు ఆధిపత్యం కోసం ఫైట్ చేయడమే ఈ షో ప్రధాన అంశం. అయితే ఈ ప్రీక్వెల్ లో టార్గారియన్ ఫ్యామిలీలోని సంఘర్షణను చూపిస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో సింహాసనం కోసం పోరాడుతున్న టార్గేరియన్లు – స్టార్క్స్ మరియు లానిస్టర్లను చూపిస్తే.. ఇప్పుడు ఒకరితో ఒకరు పోరాడుతున్న టార్గేరియన్లను చూపిస్తుంది. మొత్తం మీద విజువల్ వండర్ గా ఉన్న ఈ ట్రైలర్ సిరీస్ పై అంచనాలు రెట్టింపు చేసింది.

జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన ‘ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ నవల ఆధారంగా ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ సిరీస్ ను రూపొందించారు. ఇప్పుడు మార్టిన్ రాసిన ‘ఫైర్ అండ్ బ్లడ్’ నవల ఆధారంగా చేసుకుని ”హౌస్ ఆఫ్ ద డ్రాగన్” సిరీస్ ను రూపొందించారని తెలుస్తోంది. హెచ్బీవో మాక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.