విజయ్ మాల్యా ఆఫ్ సౌత్ వైఎస్ జగన్.. ఇదెక్కడి ట్రెండ్ మహాప్రభో.!

సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అరెస్టులు జరుగుతున్నాయంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయం విదితమే. ‘అరెస్టులు చేస్తే చేసుకోండి.. ప్రజాస్వామ్యానికి పాతరెయ్యాలనుకుంటే వెయ్యండి.. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తే వేసుకోండి.. మేం మాత్రం తగ్గేది లేదు..’ అంటున్నారు నెటిజన్లు. ఒకరా.? ఇద్దరా.? వందలా.? వేలా.? లక్షల సంఖ్యలో ట్వీట్లు పడుతోంటే ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు.? అరెస్టుల దారి అరెస్టులదే.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక, వైసీపీ వ్యతిరేక పోస్టింగుల తీరు కూడా అంతే.

వైసీపీ తక్కువేం తినలేదు.. విపక్షాల మీద అడ్డగోలు రాతలతో సోషల్ మీడియాలో రోత పుట్టించేస్తోందనుకోండి.. అది వేరే సంగతి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తాజాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటో తెలుసా.? విజయ్ మాల్యా ఆఫ్ సౌత్ వైఎస్ జగన్ అని. అదేంటీ, విజయ్ మాల్యా నార్త్ ఇండియన్ అనుకోవాలా.? ఆయనది కర్నాటక కదా.? అన్న చర్చ వెటకారంగా జరుగుతోంది వైసీపీ శ్రేణుల నుంచి. అక్కడ వ్యవహారం వేరు. ఆర్థిక నేరస్తుడిగా విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విదేశాలకు పారిపోయాడతను. ఆ విజయ్ మాల్యాతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోల్చడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ముఖ్యమంత్రిగా రెండేళ్ళ పాలనను ఇటీవలే పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలో వైసీపీ, తమ అధినేతను కీర్తిస్తూ సోషల్ మీడియాని హోరెత్తించేసింది. దానికి కౌంటర్ ఎటాక్ అనుకోవాలిప్పుడు జరుగుతున్ననెగెటివ్ ట్రెండింగ్.

రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అయిపోయాయి ఇటీవలి కాలంలో. చంద్రబాబు పుట్టినరోజునాడు వైసీపీ చేసిన నెగెటివ్ ట్రెండింగ్ అందరికీ గుర్తుండే వుంటుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు కూడా ఇవే తరహా వెకిలి చేష్టలు వైసీపీ నుంచి జరుగుతుంటాయి. సోషల్ మీడియాని అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. నిజానికి, ఆ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారం దక్కించుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చాక ఒకలా, అధికారంలో లేకపోతే ఇంకోలా సోషల్ మీడియాపై రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఏదిఏమైనా ఇటీవలి కాలంలో పాజిటివ్ ట్రెండింగ్ కంటే, నెగెటివ్ ట్రెండింగ్.. అదేనండీ ట్రోలింగ్.. విపరీతమైన పాపులారిటీ పొందుతోంది.