కర్నూలు విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేరు: సీఎం జగన్

కర్నూలు జిల్లా ప్రజల కల నెరవేరింది. ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి పి హర్‌దీప్‌సింగ్‌కు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓర్వకల్లు విమానాశ్రయానికి దేశ ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి ఇండిగో సంస్థ సర్వీసులు నడపనుంది.

1010.08 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. మూడు విభాగాలుగా విమానాశ్రయాన్ని నిర్మించారు. మొదటి భాగంలో ఎనిమిది విమానాలు, రెండో భాగంలో విమానాల మరమ్మత్తుకు అఫ్రాన్ ఐసొలేషన్ ఏర్పాటు చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఫ్యూచర్ అఫ్రాన్ నిర్మించారు. ప్రభుత్వం 7కోట్లతో నైట్ ల్యాండింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. అమెరికా నుంచి 18కోట్లతో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు.