కోవిడ్ 19 మీద ఖర్చు పెట్టిన 3 వేల కోట్లు ఏమైపోయాయ్ అధ్యక్షా.?

ఇటీవల ఆంధ్రపదేశ్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఒకే ఒక్కరోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశాల్ని నిర్వహించాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తమ ప్రభుత్వం కేవలం కోవిడ్ కోసమే 2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మరోపక్క, ప్రభుత్వ సలహాదారు, వైపీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ మీదనే 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది ఆన్ రికార్డ్. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది కూడా ఆన్ రికార్డ్. వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు హోదాలో ఈ మాట చెప్పారు. ఇంతకీ, ఏది నిజం.? రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మీద ఖర్చుపెట్టింది 5 వేల కోట్లా.? 2 వేల కోట్లా.? ఈ అంశంపై రాష్ట్ర ప్రజలకు సరైన సమాధానం దొరకాల్సి వుంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై బోల్డంత చర్చ జరుగుతోంది.

జగన్ మాట్లాడిన మాటల్ని, సజ్జల మాట్లాడిన మాటల్ని కలిపి ఓ వీడియో రూపొందించిన నెటిజన్లు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి.. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు గనుక, దాన్ని తప్పు పట్టడానికి వీలుండదు. కానీ, సజ్జల మాట్లాడింది ప్రెస్ మీట్ సందర్భంగానే. సో, సజ్జల.. తమ ప్రభుత్వం గొప్పగా ఉద్ధరించేస్తోందని చెప్పడానికే 5 వేల కోట్లంటూ చెప్పుకొచ్చారా.? అన్నదే అసలు ప్రశ్న. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అధికారికంగా ఓ వివరణ ఇవ్వాల్సిందే.

లేకపోతే, తమది అవినీతికి తావులేని ప్రభుత్వమని చెప్పుకునే వైసీపీ.. 3 వేల కోట్ల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు అంగీకరించాల్సి వస్తుంది. ‘కోవిడ్ మీదనే మూడు వేల కోట్లు బొక్కేసిన వైసీపీ..’ అంటూ అప్పుడే విపక్షాలు విమర్శలు షురూ చేసేశాయ్ మరి. ఇదిలా వుంటే, వ్యాక్సినేషన్ కోసం పేర్కొన్న బడ్జెట్ కేటాయింపులకీ.. వాస్తవంగా అయ్యే ఖర్చుకీ పొంతన లేదనీ, ప్రభుత్వం పబ్లసిటీ స్టంట్లు మాని, వ్యాక్సిన్ విషయమై శ్రద్ధ పెట్టాలనీ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.