జగన్ కు ఝలక్ ఇచ్చే ఆ ఎంపీలెవరబ్బా?

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరి తమకు సీటు గ్యారెంటీ అని హామీ ఇస్తే పది మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు జగన్ కు ఝలక్ ఇచ్చి కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ ఉన్నారట. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోందంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. దీంతో ఇది నిజమేనా? నిజమే అయితే, ఆ పది మంది ఎంపీలూ ఎవరబ్బా అని చర్చ సాగుతోంది.

జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో కేవలం సంక్షేమంపైనే దృష్టి సారించి అభివృద్ధిని విస్మరించడంతో ఆయన పాలనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఇసుక విషయంలో మాత్రం అటు ప్రజల్లోనే కాకుండా ఇటు అధికార పార్టీ నేతల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక పార్టీలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉందని, అది ఏ క్షణమైనా బద్దలు కావొచ్చంటూ వార్తలొస్తున్నాయి.

మరీ అంత కాకపోయినా.. తమకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉండటంలేదని అసంతృప్తి చాలామంది ఎమ్మెల్యేల్లో ఉంది. కనీసం జగన్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడం ఇందుకు ప్రధానంగా కారణమవుతోంది. జగన్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను కలవడం, వారి సమస్యలను పరిష్కరించడం వంటివి చేస్తే.. ఏ సమస్యా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేల విషయాన్ని పక్కన పెడితే ఎంపీల్లో అసమ్మతి భారీ ఉందని, టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుంటే పది మంది కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒక్కరే అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ కూడా ఆయన్ను అంతగా పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో పది మంది కాషాయ పార్టీలోకి వెళ్లడానికి రెడీగా ఉన్నారంటూ వచ్చిన కథనం కేవలం మైండ్ గేమ్ మాత్రమే అని వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

మళ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా నాలుగేళ్లు ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఏ రాజకీయ నాయకులైనా అప్పటి పరిస్థితులను బట్టి తమ కార్యాచరణ నిర్ణయించుకుంటారు. నాలుగేళ్ల తర్వాత కమలం పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పడం కష్టం. అప్పుడు కూడా ఇదే మెజార్టీతో కమలనాథులు అధికారంలోకి వస్తారా అని ఇప్పుడే ఊహించలేం. అలాంటి పరిస్థితుల్లో పది మంది ఎంపీలు ఇప్పటికిప్పుడు జగన్ కు ఝలక్ ఇచ్చి కాషాయ కండువా కప్పుకొనే సాహసం చేస్తారని అనుకోలేం. పైగా బీజేపీకి రాజ్యసభలో బలం అవసరంగానీ, లోక్ సభలో కాదు. ఈ నేపథ్యంలో నిజంగానే పార్టీపై అసంతృప్తి ఉన్న ఎంపీలు కూడా పార్టీ మారే సాహసం చేయరనేది నిర్వివాదాంశం.

పార్టీ మారితే తమకు వచ్చే లాభం ఏమిటనే ప్రాతిపదికనే మాత్రమే ఏ నేతైనా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం బీజేపీలోకి వెళ్తే అధికార పార్టీలో ఉన్నామన్న విషయం ఒక్కటి తప్ప.. ఏ విధంగానూ ఉపయోగం ఉండదు. పైగా అలా చేస్తే అదనంగా మెడపై అనర్హత కత్తి వేలాడటం ఖాయం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ప్రచారం నిజం కాదని అంటున్నారు.