అంబానీ సంగీత్‌లో స‌ల్మాన్-ర‌ణ్‌వీర్ డ్యాన్సులు

అనంత్ అంబానీ- రాధిక మ‌ర్చంట్ వివాహం ఈనెల 12న ముంబై జియో సెంట‌ర్ లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. కొన్ని నెల‌ల‌ ముందే పెళ్లి సంబ‌రాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు ప్రీవెడ్డింగ్ పార్టీలు అద్భుతంగా జ‌రిగాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ్గ‌జాలు ఈ వేడుక‌ల‌కు అటెండ‌య్యారు. అంబానీల స్టైల్లో ఎంతో అల్ట్రా రిచ్ గా ఈ వేడుక‌లు జ‌ర‌గ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈనెల 12న అస‌లు పెళ్లితో ఈ వేడుక‌కు ముగింపు ఉంటుంది.

జులై 5 (నేటి) రాత్రి సంగీత్‌ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ – రణవీర్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారనేది తాజా వార్త‌. గుజరాత్ జామ్‌నగర్‌లో మార్చిలో జరిగిన అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాల్లో వేదికపైకి వచ్చారు స‌ల్మాన్‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు భాయ్ ప్ర‌ద‌ర్శ‌న‌కు రెడీ అవుతున్నాడు. ఈ రోజు రాత్రి ముంబైలోని NMACCలో జరగనున్న అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో సల్మాన్ ఖాన్ – రణవీర్ సింగ్ ప్రేక్షకులను అలరించనున్నారని సోర్సెస్ ఇండియాటుడేకి తెలిపాయి. వారు ఏ పాటలకు ప్ర‌ద‌ర్శ‌న ఇస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ స్టేజ్ పెర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ నుంచి గొప్ప స్పంద‌న వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే తండ్రి కాబోయే రణవీర్ సింగ్ క‌చ్ఛితంగా తన ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్‌తో క‌ట్టి ప‌డేస్తాడ‌న‌డంలో సందేహం లేదు.

సంగీత్ పార్టీతో పెళ్లి వేడుక‌లు పీక్స్ చేరుకుంటున్నాయి. రెండు కుటుంబాలను క‌లుపుతూ వధూవరుల కోసం కొన్ని ఆశ్చర్యకరమైన డ్యాన్స్ నంబర్‌లను ప్లాన్ చేశార‌నేది తాజాగా అందిన వార్త‌. అంతేకాదు ఈ జంట సన్నిహితులు రాధిక, అనంత్‌ల కోసం కొన్ని స్కిట్లు కూడా ప్లాన్ చేశారని తెలిసింది. రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్‌తో పాటు, మీజాన్ జాఫెరీ, వీర్ పహారియా, జాన్వీ కపూర్ సంగీత్‌లో నృత్యం చేయాలని భావిస్తున్నారు. సంగీత్ నైట్ కోసం రిహార్సల్స్ వారం రోజులుగా జరుగుతున్నాయి.

ఈ రాత్రి ప్రదర్శనల గురించి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంతే కాదు.. అనంత్- రాధికల సంగీత్‌లో ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వడానికి ఈ రోజు భారతదేశంలోకి వచ్చిన జస్టిన్ బీబర్ త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఉర్రూత‌లూగిస్తాడ‌ని అంచ‌నా వేస్తున్నారు. అతడు తన హిట్ పాటల‌ను పాడాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ పాప్ స్టార్ తో క‌లిసి బాద్షా, కరణ్ ఔజ్లా కూడా ప్రేక్షకులను అల‌రించ‌నున్నారు.