
ఇద్దరిదీ వందేళ్ల కోరిక అంటే వందేళ్లుగా ఉన్న కోరిక కాదు. వందేళ్ల వయసు వచ్చేంతవరకు అధికారంలో ఉండాలనే కోరిక అని అర్థం. ఇంత గొప్ప ఆకాంక్ష ఉన్న నాయకులెవరు? చిన్న నాయకులకు ఇంత పెద్ద ఆశ ఉండదు కదా. వీరే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీర్ఘకాలం అధికారంలో ఉండాలనే కోరిక ఇద్దరికీ ఉందనేదాంట్లో సందేహంలేదు.
వందేళ్ల వయసు వచ్చేదాకా ముఖ్యమంత్రులుగా ఉంటామని చంద్రులు నేరుగా చెప్పకపోయినా సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలనే కోరికను పలుమార్లు వ్యక్తం చేశారు. ఇక వారి కుమారులు కమ్ మంత్రులు కేటీఆర్, లోకేష్, ఇరు పార్టీల్లోని నాయకులు ఇద్దరు చంద్రలు మరో 30 ఏళ్లకుపైగానే అధికారంలో ఉంటారని, ఉండాలని అన్నారు. ఇంత దీర్ఘకాలం ఉంటేనే రాష్ట్రాలు బాగుపడతాయట. వేరే పార్టీ ఏదైనా అధికారంలోకి వస్తే మటాష్ అయిపోతాయట.
తాజాగా కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ అండ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు (సీపీఎం) సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పారని, దాన్ని కేసీఆర్ అధిగమిస్తారని అన్నారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం చూస్తుంటే జ్యోతి బసు రికార్డును అధిగమిస్తారనే విశ్వాసం ఉందన్నారు.
మరి చంద్రబాబునాయుడు ఏ ముఖ్యమంత్రి రికార్డును అధిగమించాలని టీడీపీ నాయకులు కోరుకున్నారో తెలియదు. వారూ కేటీఆర్ మాదిరిగా చెప్పాల్సిందే. జ్యోతి బసుకు మించిన రికార్డు లేదు కదా. మార్క్సిస్టు దిగ్గజం బసు 24 ఏళ్లు (1977-2000) ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉమ్మడి ఆంధ్రాలో చంద్రులు అప్పుడప్పుడే రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు.
జ్యోతి బసును అధిగమించాలనే కోరిక ఉన్న చంద్రులకు ఆయన పేరు ఉచ్చరించే, తలచుకునే అర్హత కూడా లేదు. అపూర్వమైన, అప్రతిహతమైన ప్రజాదరణతో ఆయన సీఎంగా కొనసాగారు. వీరిమాదిరిగా బమ్మిని తిమ్మిని చేసి, ఇంద్రజాల మహేంద్రజాలాలు చేస్తూ, టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలు ప్రదర్శిస్తూ అధికారంలో కొనసాగాలనుకోలేదు. కేటీఆర్ కోరిక ప్రకారం ఆయన తండ్రి బసు రికార్డును అధిగమిస్తారనుకుందాం. ఆయన 24 ఏళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈయన 30 ఏళ్లు ఉండాలి. ప్రస్తుతం 63 ఏళ్ల వయసులో ఉన్న కేసీఆర్ ముప్పయ్ ఏళ్లు అధికారంలో ఉంటే సుమారుగా వందేళ్లకు దగ్గరవుతారు.
అన్నేళ్ల వరకు పూర్తి ఆరోగ్యంగా ఉండగలరా? సీఎం పదవిని నిర్వహించే మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగల విచక్షణ ఉంటాయా? ఇవే ప్రశ్నలు చంద్రబాబుకూ వర్తిసాయి. కేసీఆర్ కంటే ఆయన నాలుగేళ్లు పెద్ద. ఇప్పటివరకూ ఆయన ఆరోగ్యానికి ఢోకా లేకపోయినా వయసు పైబడుతున్న కొద్దీ అదే ఆరోగ్యం ఉంటుందా? రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన కరుణానిధి (93)ఎలా ఉన్నారో చూస్తున్నాం.
పదవిలో ఉండగానే ఎంజీఆర్, జయలలిత ఎలా అయిపోయారో చూశాం. వారు అనారోగ్యం పాలయ్యేనాటికి వందేళ్లు రాలేదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, జార్జి ఫెర్నాండెజ్ ఎలా ఉన్నారో తెలుస్తూనే ఉంది. కాబట్టి చంద్రులకు అత్యాశ ఎందుకు? నిజంగా వందేళ్ల వయసు వచ్చేవరకు పరిపాలిస్తే ఇంకెన్ని అనైతిక పనులకు పాల్పడతారో మరి…!
Recent Random Post: