తిరుపతి లడ్డు వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆధారాలు అడగడంతో సన్నివేశం మొత్తం మారిపోయింది. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలే నెట్టింట నెటి జనులకు టార్గెట్ అయ్యాయి. సనాతన ధర్మం పేరిట అతడు చేసిన యాగిని గుర్తు చేస్తూ నెటి జనులంతా మండి పడుతున్నారు.
దేవుడిపైనే రాజకీయాలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంలో పవన్ కళ్యాణ్-ప్రకాష్ రాజ్ మధ్య కూడా కొంత మాటల యుద్ధం ముందే సాగింది. మధ్యలో మంచు విష్ణు కూడా కల్పించుకుని దిగడంతో? అతడిపైనా ప్రకాష్ రాజు నిప్పులు చెరగడం జరిగింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో తాజాగా మరోసారి పవన్ పై వ్యంగ్యా స్త్రాలు విసిరారు.
`కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా? ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి` అంటూ తెలుగులో ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొంత మంది పవన్ కళ్యాణ్ కిమద్దతుగా నిలవగా మరికొంత మంది ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఆ వివాదం పక్కనబెడితే పవన్ -ప్రకాష్ రాజ్ కలిసి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ నటించిన బద్రీ సినిమాలో ఇద్దరు క్యారెక్టర్లు నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ పడతాయి. `నువ్వు నందా అయితే నేను బద్రీ బద్రీనాద్` అంటూ పవన్ ఆవేశపూరిత డైలాగులు అభిమానుల్ని ఎంతగానో మెప్పించాయి.