
కాంగ్రెస్‌లో వున్నప్పుడు కాంగ్రెస్‌ని విమర్శించడంద్వారా జేసీ దివాకర్‌రెడ్డి తన ఉనికిని చాటుకునేవారు. అదో టైపు పబ్లిసిటీ స్ట్రాటజీ. దాన్నే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే జేసీ దివాకర్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. టీడీపీపైనా, టీడీపీ ప్రభుత్వంపైనా జేసీ దివాకర్‌రెడ్డి విమర్శలు చేస్తూ, ఎప్పటికిప్పుడు తన పేరు మీడియాలో వుండేలా చూసుకుంటున్నారు. అలాగని, టీడీపీకి గుడ్ బై చెబతారా.? అంటే అదీ లేదు.! తిట్టిన నోటితోనే పొగడటం, పొగిడిన నోటితోనే తిట్టడం జేసీ దివాకర్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.
‘విమర్శ చేసినా నేనే చెయ్యాలి.. పొగిడినా నేనే పొగడాలి..’ అంటారు జేసీ దివాకర్‌రెడ్డి. ఆయనకి అదో ‘తుత్తి’.! 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన విషయం విదితమే. చంద్రబాబుని అపర భగీరధుడిగా కీర్తించిన జేసీ దివాకర్‌రెడ్డి, అంతలోనే.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారనీ, అది పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదనీ.. చాలా అధికారిక వేదికలపైనే సెలవిచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?
‘చంద్రబాబుని పొగుడుతాను.. ఎందుకంటే, రాష్ట్రానికి ఇప్పుడు చంద్రబాబు తప్ప, ఇంకో దిక్కు లేదు. ఆయన మాత్రమే, రాష్ట్రాన్ని ఉద్ధరించగలరు. చంద్రబాబు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ది అధోగతే..’ అని జేసీ దివాకర్‌రెడ్డి తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు భజన చేయడమే కాదు, చంద్రబాబుని విమర్శించడంలోనూ జేసీ దివాకర్‌రెడ్డి దిట్ట. మొన్నామధ్య, చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు చేస్తూ, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించి అందర్నీ విస్మయానికి గురిచేశారు. ఆ సమయంలో, చంద్రబాబు అండ్ కో ఒకింత ఆందోళన చెందింది. జేసీ దివాకర్‌రెడ్డిని బుజ్జగించింది. ఆ తర్వాత రాజీనామాపై జేసీ బుకాయించారనుకోండి.. అది వేరే వియం.
చంద్రబాబుని పొగడటమే కాదు, జగన్‌ని తూలనాడటంలోనూ జేసీకి సాటి ఇంకెవరూ రారు. ఆ విషయంలో మాత్రం, జేసీ దివాకర్‌రెడ్డికి ‘ఒకటే నాలుక’. ‘మావాడే..’ అంటూ అడ్డమైన తిట్లూ తిట్టేస్తుంటారు జేసీ దివాకర్‌రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిని. ఆయనకి అదో సరదా.. దాన్నే, పైత్యం అని ఆయన వ్యతిరేకులంటారనుకోండి.. అది వేరే సంగతి.!
అన్నట్టు, 2019 ఎన్నికల్లో తమ కుటుంబానికి చంద్రబాబు టిక్కెట్లు కూడా ఇవ్వకపోవచ్చంటూ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే, 2019 నాటికి తాను పార్టీ మారనున్నట్లు జేసీ ఇప్పటినుంచే సంకేతాలు పంపుతున్నారనుకోవాలి.! అలా ఎవరన్నా అనుకుంటారేమోనని ముందుగానే జాగ్రత్తపడ్తున్న జేసీ దివాకర్‌రెడ్డి, ‘చంద్రబాబుని మనస్ఫూర్తిగానే అభినందిస్తున్నాను.. ఆయన్ని ఇలా పొగడుతున్నందుకు ఆయన మాకేమీ మంత్రి పదవులు ఇవ్వరు.. 2019 ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తారన్న నమ్మకమూ లేదు..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు జేసీ దివాకర్‌రెడ్డి.
2014కి ముందు కాంగ్రెస్ భజన, 2014 తర్వాత టీడీపీ భజన.. ఏమో, 2019 ఎన్నికల తర్వాత జేసీ, జగన్ భజన చేయరన్న గ్యారంటీ ఏంటి.?
Recent Random Post:

















