
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం త్వరలోనే ముగియబోతోంది. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాలను పట్టించుకుంటున్నది కూడా లేదు గానీ.. త్వరలోనే.. కనీసం రాజకీయ రంగు కూడా ఆయనకు లేకుండా పోతుంది. ప్రస్తుతం చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. బహుశా అప్పటికి ‘సైరా’ ఉయ్యాల వాడ కూడా విడుదల అయిపోయి.. మెగాస్టార్ గా తిరిగి పూర్వవైభవాన్ని దక్కించుకోవడానికి చిరంజీవి మంచి ఊపు మీద ఉండే అవకాశం ఉంది.
అయితే మార్చిలో రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం అయిపోతే.. మళ్లీ ఆయనకు మరోసారి ఎక్స్ టెన్షన్ దక్కే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఏపీలో ఖాళీ అయ్యే మూడు సీట్లలో చిరంజీవి సీటు ఉంది. మరి కొత్తగా మూడు స్థానాలకు ఎన్నిక జరిగినా కాంగ్రెస్ కు చెందిన చిరంజీవికి అవకాశం రాదు. అంటే ఆయన రాజకీయ ప్రస్థానానికి ఎండ్ కార్డు పడుతుందన్నమాట.
క్రియాశీల రాజకీయ నాయకులు అయితే.. ఒక టర్మ్ పదవులు లేకపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ.. రాజకీయ వ్యవహారాల్లో మునిగి తేలుతూ నాయకుడిగా తమ అస్తిత్వాన్ని మాత్రం కాపాడుకుంటూ ఉంటారు. కాని చిరంజీవి పరిస్థితి వేరు. ప్రజల్లోంచి ఎన్నికయ్యే పోరాట పటిమ ప్రదర్శించడం కూడా ఇష్టం లేక.. కాంగ్రెసు పార్టీ ప్రాపకంతో రాజ్యసభ ద్వారా పదవుల్లోకి వెళ్లిన వ్యక్తి చిరంజీవి. అందుకే కాంగ్రెస్ ప్రభ పతనం అయిపోయే సరికి ఆయన విషయంలో ఏకంగా రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడబోతోంది.
మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి.. ఏకంగా ముఖ్యమంత్రి కాగలననే విశ్వాసంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలో.. అది నిలువలేకపోయింది. నామమాత్రపు సీట్లతో పార్టీ మిగిలింది. ఈలోగా పార్టీ టికెట్లు అమ్ముకున్నారని, అరాచకంగా పార్టీ వ్యవహారాలు ఉన్నాయని అనేక రకాలుగా ఆయన అపకీర్తిని మూట కట్టుకున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత.. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి.. సోనియా ప్రాపకంతో కేంద్రమంత్రి అయ్యారు.
కేంద్ర మంత్రి స్థాయిలో రాజకీయ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లిన సినీనటుడు ఆ తదనంతర పరిణామాల్లో చాలా వేగంగా.. రాజకీయ జీవితాన్ని ముగింపు దశకు తీసుకువచ్చేయడం బహుశా చిరంజీవి విషయంలోనే జరుగుతుండవచ్చు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా లేనట్టే. ఇక చిరంజీవి రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే అని ప్రజలు అనుకుంటున్నారు.
Recent Random Post:

















