‘పద్మావతి’తో రిస్క్‌ చెయ్యలేక..

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఎదుర్కొన్న, ఎదుర్కొంటోన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా సిబ్బందిపై దాడులు జరిగాయి.. సెట్స్‌ తగలబడ్డాయి.. ఎలాగైతేనేం, మొత్తానికి ‘పద్మావతి’ సినిమా షూటింగ్‌ పూర్తయి, విడుదలకు సిద్ధమవుతోంది. ‘మాకు చూపించకుండా సినిమా విడుదల చేశారో, థియేటర్లు పేలిపోతాయ్‌..’ అనే హెచ్చరికలు దూసుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘పద్మావతి’ టీమ్‌ రిస్క్‌ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు.

మామూలుగా అయితే ఓ మోస్తరు బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాకి, చిన్న బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాకీ వివాదాలు ఎంతో కొంత ఉపకరిస్తాయి ఫ్రీ పబ్లిసిటీ కోణంలో. కానీ, భారీ బడ్జెట్‌ సినిమాలకు ఆ వివాదాలు పబ్లిసిటీ పరంగా కలిసొచ్చే అవకాశాలు తక్కువ.. దాంతో, రిస్క్‌ ఎక్కువైపోతుంటుంది. అందుకేనేమో, ‘పద్మావతి’ మేకర్స్‌ మెట్టు దిగినట్లే కన్పిస్తోంది. ‘పద్మావతి’పై అభ్యంతరాల నేపథ్యంలో ఎవరైతే సినిమాకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారో, వారి తరఫున ఓ ప్రతినిథి బృందానికి సినిమాని ముందే చూపించెయ్యాలనే నిర్ణయానికి వచ్చారట ‘పద్మావతి’ మేకర్స్‌.

దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, వయాకామ్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం విదితమే. వివాదాలు సినిమాని ఆర్థికంగా దెబ్బతీస్తాయనీ, అదే సమయంలో తమ కష్టం వృధా అవుతుందనీ ఇటు భన్సాలీ, అటు వయాకామ్‌ ఓ అవగాహనకు రావడంతో, త్వరలోనే ‘పద్మావతి’ ఆందోళనకారుల టీమ్‌ కోసం ‘పద్మావతి’ టీమ్‌ ప్రత్యేకంగా సినిమాని ప్రదర్శించేందుకు ముందుకు రావడం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది.

అయితే, ఆ కొంతమంది ప్రతినిథుల విషయంలోనూ కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి ‘చర్చల’ వ్యవహారం తమ దృష్టికి రాలేదనీ, సినిమాని అడ్డుకుని తీరాలన్న తమ నిర్ణయంలో ఇప్పటికైతే ఎలాంటి మార్పూ లేదని ఆందోళనకారులు తెగేసి చెబుతోంటే, ఇంకోపక్క చిత్ర బృందం నుంచి తమకు సమాచారం వచ్చిందంటున్నారు ఆందోళనకారుల్లో ఇంకొందరు. మొత్తమ్మీద, సినిమా అయితే డిసెంబర్‌ 1న విడుదల కావాల్సి వుంది. ఈలోగా వివాదం సద్దుమణుగుతుందా.? వేచి చూడాల్సిందే.


Recent Random Post: