
‘ఏమో, ఇకపై సెన్సార్ బోర్డ్ నిర్ణయాలకు విలువ వుండదేమో. ఏదన్నా సినిమా తెరకెక్కించాలంటే ముందుగా రాజకీయ పార్టీలకు ఆ సినిమా స్క్రిప్ట్ చూపించాల్సి వుంటుందేమో. స్క్రిప్ట్‌ని ఆన్‌లైన్‌లో పెట్టేసి, ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, అప్పుడు మాత్రమే ఆ సినిమా తెరకెక్కించాలనే నిబంధనలు వస్తాయేమో..’ అంటూ బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఆవేదన వ్యక్తం చేసింది.
తన తాజా చిత్రం ‘పద్మావతి’ వివాదాలపై దీపికా పడుకొనే మాట్లాడుతూ పై విధంగా స్పందించింది. చారిత్రక నేపథ్యమున్న సినిమా.. అన్న ఒక్క కారణంతో, ‘పద్మావతి’ సినిమాపై ఇంతటి విషం చిమ్మడం ఏమాత్రం సబబు కాదని అంటోందామె. ‘సినిమా కోసం వందలాదిమంది పనిచేశారు.. నటీనటులు, టెక్నీషియన్స్.. ఇంత మంది కష్టపడి పనిచేస్తే.. ఇప్పుడీ సినిమా విడుదలకు ముందు థియేటర్లను పేల్చేస్తామనడం ఎంతవరకు సబబు.?’ అని ప్రశ్నించింది దీపికా పడుకొనే.
‘వ్యవస్థల మీద నమ్మకం వుంది. సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే విడుదలవుతుంది..’ అని ఆశాభావం వ్యక్తం చేసిన దీపికా పడుకొనే, ‘పద్మావతి’కి వచ్చిన కష్టం, భవిష్యత్తులో ఇంకే సినిమాకీ రాకూడదని అభిప్రాయపడింది. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఇండియన్ సినిమా గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని దీపిక అంటోంది.
Recent Random Post: