
”ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే పాదయాత్ర ఆగదు.. ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 2వ తేదీన వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది.. న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నాం.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి లోబడే పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ విడుదల చేస్తాం.. వైఎస్ జగన్‌ని చూస్తే టీడీపీ ఎందుకు భయపడుతోంది.?”
– ఇదీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ‘కుదరదు’ అంటూ న్యాయస్థానం జగన్ పిటిషన్‌ని కొట్టివేసిన అనంతరం వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల సారాంశం.
గత కొద్ది రోజులుగా ఈ విషయమై పెద్ద చర్చే జరుగుతోంది. ‘ఆరు నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేస్తా..’ అంటూ కొన్నాళ్ళ క్రితం గుంటూరులో వైఎస్ జగన్ ప్రకటన చేసిన తర్వాత చాలామంది వైఎస్సార్సీపీ నేతలే షాక్‌కి గురయ్యారు. ప్రతి శుక్రవారం వైఎస్ జగన్, న్యాయస్థానం యెదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వుంది. ఈ విషయం ఆయనకీ తెలుసు.
అయితే, విదేశాలకు వెళ్ళేందుకు ఊరట పొందినట్లు, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఊరట పొందినట్లు పాదయాత్రకూ ఊరట దక్కుతుందని జగన్ అనుకోవచ్చుగాక. కానీ, ఆరు నెలలపాటు విచారణకు హాజరు కాలేనని వైఎస్ జగన్ చెబితే, న్యాయస్థానం ఎలా అంగీకరిస్తుంది.? అన్న ప్రశ్న వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితులైనవారిలోనూ కలిగినట్లు లేదు. లేదంటే, వారైనా జగన్‌కి తగు సలహాలు ఇచ్చేవారేమో.
అన్నిటికీ మించి, తన పరిస్థితేంటో తెలిసీ వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రను ఎంచుకోవడం ఆశ్చర్యకరమే. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌కి, పాదయాత్ర చేసే హక్కుంది. కానీ, జగన్ పరిస్థితి వేరు. ఇప్పుడు జగన్ విషయంలో టీడీపీ భయపడ్తోందని వాసిరెడ్డి పద్మ భయపడ్తున్నారుగానీ, నిజానికి భయపడాల్సింది వైఎస్సార్సీపీనే. నవంబర్ 2న పాదయాత్ర ప్రారంభిస్తారు సరే, ఆ పాదయాత్రను ఎలా కొనసాగిస్తారన్న టెన్షన్ అయితే ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణుల్లో వుంటుంది.
వారానికోసారి పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాల్సి వస్తే, ఖచ్చితంగా పాదయాత్రలో సీరియస్‌నెస్ తగ్గిపోతుంది. అధికారపక్షం నుంచి విమర్శలూ ఎక్కువైపోతాయి. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై టీడీపీ ఏ స్థాయిలో ప్రచారం చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారం వారం పాదయాత్రకు బ్రేక్ ఇస్తూ వెళుతోంటే, అప్పుడిక టీడీపీ నుంచి వచ్చే విమర్శల్ని తట్టుకోవడం వైఎస్సార్సీపీకి చాలా చాలా కష్టం.
రాజకీయ వ్యూహాల విషయంలోనూ, తనపై వున్న కేసుల విషయంలోనూ వైఎస్ జగన్ ఇప్పటికైనా తగిన వ్యూహాలతో ముందడుగు వేయాల్సి వుంటుంది. లేదంటే ఓ వైపు పార్టీకి ఇంకో వైపు తనకు రాజకీయంగా నెగెటివ్ మార్క్స్ ఎక్కువైపోతాయని జగన్ గుర్తిస్తే మంచిది. వాస్తవం జీర్ణించుకోవడానికి కష్టంగానే వుంటుంది.. కానీ, వాస్తవం గుర్తించకపోతే, తప్పొప్పుల్ని సరిదిద్దుకోకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం.
Recent Random Post:

















