పోలవరంలో బయల్పడుతున్న పాపాలు..

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక విషయాలు తాజాగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు దేశంలోనే లేని సమయంలో.. రాష్ట్రప్రభుత్వ ఆజమాయిషీతో నిమిత్తం లేకుండా.. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుతెన్నుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన కేంద్ర కమిటీ పరిశీలనలో వెల్లడవుతున్న వాస్తవాలు.. బహుశా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ అసలు పోలవరం పనులు జరుగుతున్నాయంటే.. సొమ్ము కేంద్రానిది కావొచ్చు గానీ.. క్రెడిట్ మొత్తం నా పుణ్యమే అన్నట్లుగా చంద్రబాబునాయుడు టముకు వేసుకుంటూ వచ్చారు. కానీ వాస్తవంలో.. నిందలు ఆయన మీదికే మళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పరోక్షంలో సమీక్షించడానికి వచ్చిన కమిటీకి కాంట్రాక్టర్లు ఉన్నదున్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లుగా చెబుతున్నారని తెలుస్తోంది.

పోలవరం ప్రధాన పనులను చేపడుతున్న కాంట్రాక్టరు ట్రాన్స్ ట్రాయ్ సంస్థను మార్చాలని కొత్తగా టెండర్లు పిలవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన దగ్గరినుంచి.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అసలు రగడ మొదలైంది. తమకు వ్యవధి ఇవ్వకుండానే.. సకాలంలో భూమి అప్పగించకుండానే తమను తప్పించజూస్తు్నారంటూ ట్రాన్స్ ట్రాయ్ వాదించడం ప్రారంభించింది. అదనపు భారం భరించడం తమ వల్ల కాదని కేంద్రం తిరస్కరిస్తున్నప్పటికీ, కొత్త టెండర్లకు చంద్రబాబునాయుడు ఒత్తిడి చేస్తున్నందువల్లనే అసలు పనులు ఎందుకు లేటవుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని రావాల్సిందిగా కేంద్రం ఢిల్లీనుంచి కమిటీని పంపింది. వీరు నివేదిక సమర్పించిన తర్వాత ఢిల్లీనుంచి మరో కమిటీ కూడా వస్తుంది.

అయితే ఈ కమిటీ పనుల జాప్యానికి కారణాల గురించి ట్రాన్స్ ట్రాయ్ ను ప్రాజెక్టు సైట్ లో నిలదీసినప్పుడు.. తమకు సకాలంలో భూములే అప్పగించకపోతే పనులు ఎలా జరుగుతాయంటూ వారు ఎదురు ప్రశ్నించడం గమనార్హం. మొత్తానికి వారు ప్రభుత్వానికే పాపం అంటగట్టదలచుకున్నారని తేలుతోంది. అందులో కొంత వాటా చంద్రబాబు ప్రభుత్వానికి కూడా ఉంటుంది.

అయితే ఇన్నాళ్లూ ట్రాన్స్ ట్రాయ్ కు లబ్ధి జరిగేలా.. టెండర్లు రివైజ్ చేయడానికి రకరకాలుగా సహకరించిన చంద్రబాబునాయుడు ఎందుకు కొత్త టెండర్లకు వెళుతున్నారనేది పలువురికి కలుగుతున్న సందేహం. అదే సమయంలో.. తమకు వ్యవధి ఇస్తే పనులు చేయగలమని, కాకపోతే.. జాప్యం వల్ల ఆర్థిక భారం పెరిగిందని ట్రాన్స్ ట్రాయ్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఆర్థిక భారం అనగానే వ్యవహారం మళ్లీ కేంద్ర పరిశీలనకు మళ్లుతుంది. అలాగే బిల్లుల చెల్లింపులు కూడా జరగకపోయినందువల్లనే పనులు చేయలేకపోతున్నాం అంటూ కాంట్రాక్టు సంస్థలు ఏకంగా ఢిల్లీ కమిటీకే చెప్పుకుంటున్నాయి.

మరి ఇన్నాళ్లుగా ‘ప్రతిసోమవారం పోలవరం వారం’ అంటూ నినాదాలు సృష్టించుకుంటూ చంద్రబాబునాయుడు ఏం సాధిస్తున్నారనేది పలువురిలో కలుగుతున్న సందేహం. ఈ కమిటీ నివేదిక తర్వాత.. మరో కమిటీ కూడా వచ్చి పనుల తీరు గమనిస్తే.. ఇన్నాళ్ల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా పూర్తిగా బయటపడతాయనే అంతా అనుకుంటున్నారు.


Recent Random Post: