
రేవంత్ రెడ్డి ఎపిసోడ్ వల్ల తెలుగుదేశానికి పరువు నష్టం, బలం నష్టం అనేది గ్యారంటీ అయితే. అయితే ఈ పరిణామం నాయకుల్లో వ్యక్తిగతంగా ఎవరికి మేలు? ఎవరికి చేటు? అనేది నిదానంగా తేలుతుంది. కాకపోతే.. ప్రస్తుత పరిణామం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం తిరుగులేని గుణపాఠం అని అదే పార్టీలోని పలువురు సీనియర్లు తమలో తాము సెటైర్లు వేసుకుంటున్నారట.
ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, వారంతా కూడా పార్టీకోసం తమ సర్వశక్తులూ ఒడ్డి పనిచేస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి వారిని పక్కన పెట్టి.. కేవలం దూకుడు తప్ప.. మరో నిలకడతనం ఎరగని రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం ద్వారా తాను చేసిన తప్పిదానికి , ఇప్పుడు ఆయనకు ఈ గుణపాఠం మంచిదేనని టీ సీనియర్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారుట.
నిజానికి రేవంత్ రెడ్డి కంటె ముఖ్యులు, సీనియర్లు అయిన నాయకులు తెలుగుదేశానికి తెలంగాణలో కూడా పుష్కలంగానే ఉన్నారు. వారందరూ ఉండగానే.. కేసీఆర్ ను తిట్టడంలో విపరీతమైన దూకుడు ప్రదర్శించడం తప్ప మరో అర్హత లేకపోయినప్పటికీ.. రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం సబబు కాదని పలువురికి అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి అభిప్రాయం చెప్పినప్పటికీ… అధినేత వారి మాటల్ని ఖాతరు చేయలేదు అనేది వారి అసంతృప్తిగా ఉంది.
దాంతో చాలా మంది నాయకులు పార్టీ పట్ల భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఇప్పుడు తెదేపాలో తన హోదాను వాడుకుని బాగా రాష్ట్రవ్యాప్త క్రేజ్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. పార్టీని కాలదన్ని కాంగ్రెసులోకి వెళుతున్నారు. రేవంత్ రెడ్డిని అనవసరంగా ఎత్తి నెత్తిన కూర్చోబెట్టుకున్నందుకు ఇలాంటి గుణపాఠం చంద్రబాబుకు ఉండాల్సిందే అని వారు భావిస్తున్నారు.
మామూలుగా అయితే పార్టీ మీద చంద్రబాబునాయుడు మోనోపలి నడుస్తుంటుంది. పార్టీలో చీమ చిటుక్కుమన్నా సరే.. ఆయన అనుమతి ఉండాల్సిందే. అలాంటి నిరంకుశత్వాన్ని భరిస్తూనే నాయకులు కొనసాగుతూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నిర్ణయాల పట్ల కూడా ధిక్కార స్వరం వినిపించడానికి తె-సీనియర్లు వెనుకాడడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఈదశకు వచ్చినప్పుడు కూడా అధినేతకు వాస్తవాల్ని ఉన్నదున్నట్టుగా చెప్పకపోతే.. పార్టీకి చేటు జరుగుతుందని వారు అంటున్నారట.
చంద్రబాబునాయుడు ఈ రేవంత్ ఎపిసోడ్ నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, పార్టీకోసం నిజాయితీగా పనిచేసే వారికి పెద్దపీట వేయాలని అంటున్నారుట. తెలంగాణ పార్టీని గాలికొదిలేసినట్లుగా వ్యవహరించడం కరక్టు కాదని.. ఏదో ఒక నాటికి తెలంగాణలో పార్టీ అస్తిత్వం మిగిలి ఉండాలని చంద్రబాబునాయుడు కోరుకుంటే గనుక.. ఈ గుణపాఠంతో.. పద్ధతి మార్చుకోవాలని, తమ మాట చెవిన వేసుకోవానలి తె-సీనియర్లు కోరుతున్నారుట.
Recent Random Post:

















