బాబుగారి ‘భ్రమరావతి’కి రెండేళ్ళు.!

2015 అక్టోబర్‌ 22.. డేట్‌ గుర్తుంది కదా.? ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రోజు. చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి.. ఇదీ నరేంద్రమోడీ, ఢిల్లీ నుంచి అమరావతికి తీసుకొచ్చిన గొప్ప ‘నిధి’.! ప్రత్యేక హోదా అడగలేకపోగా, మొహమాటంగా ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏదో మాట్లాడారు చంద్రబాబు అప్పట్లో, నరేంద్రమోడీతో. అదీ అత్యంత దీనంగా.!

‘తెలంగాణ రాష్ట్రం తరఫున సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కోసం నిధులు ప్రకటించాలనుకున్నాం.. కానీ, ప్రధాని నరేంద్రమోడీనే చేతిలో మట్టి, చెంబుతో నీళ్ళు తీసుకొచ్చినాక మేం నిధుల్ని ప్రకటిస్తే బాగోదు.. అందుకే ఆగాం.. అమరావతికి సహాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా వుంటాం..’ అని ఆ తర్వాత ఓ సందర్భంలో చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు.

2016 అక్టోబర్‌ 12 వచ్చి వెళ్ళింది.. ఇప్పుడు 2017 అక్టోబర్‌ 22 కూడా వచ్చి వెళ్ళింది. అంటే, రెండేళ్ళు పూర్తయ్యాయన్నమాట. ఏదీ అమరావతి.? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడంలేదు. తాత్కాలిక సచివాలయం (అదేనండీ అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌) ఒక్కటీ నిర్మించేసి, చంద్రబాబు సర్కార్‌ చేతులు దులిపేసుకుంది. మిగతావన్నీ గాల్లో మేడలే. మాకీ సంస్థని మకిలి పట్టించేశారు.. ఇప్పుడు నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థతో డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు.

2018 చివరి నాటికి (అంటే, మిగిలిన ఏడాదిలోనే) రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తయిపోతుందని గతంలో చెప్పిన చంద్రబాబు సర్కార్‌, ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో చంద్రబాబు బిజీగా వున్నారు. అమెరికా అయిపోయింది, ఇప్పుడు గల్ఫ్‌ దేశాల్లో తిరుగుతున్నారు. అహో అద్భుతం అంటూ దుబాయ్‌ అందాల్ని చూసి మైమర్చిపోతున్నారు. ఆగండాగండీ, కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చేసుకుందట చంద్రబాబు సర్కార్‌ ఈ పర్యటనలో.

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు చంద్రబాబు అని.. ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలకు విలువెక్కడ.? హుండీలు పెట్టారు.. ‘మై బ్రిక్‌ మై అమరావతి’ అన్నారు.. ఇంకా చాలా చాలా చేశారు. ఏదీ ఎక్కడ.? అమరావతి రూపు రేఖలే ఇంకా కన్పించడంలేదాయె. బాబుగారి కళ్ళతో చూస్తే మాత్రం ‘భ్రమరావతి’ కన్పించేస్తుందేమో.!

కొసమెరుపు: రాజధాని నిర్మాణానికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని పదే పదే చంద్రబాబు సర్కార్ చెబుతోంది. నిజమేనా.? అడ్డుపడుతున్నది విపక్షాలా.? అధికారపక్షమా.?


Recent Random Post: