రండి.. వచ్చేయండి.. మద్దతిచ్చేయండి.!

‘రండి బాబూ రండి.. రండి తల్లీ వచ్చేయండి.. వచ్చినోళ్ళకి వచ్చినంత.. మా పాలన చూసి అద్భుతం అంటున్నారంతా.. కొంతమందికి ఆ అభిమానం వున్నా, కొన్ని కారణాలతో ఇతర పార్టీల్లోంచి రాలేకపోతున్నారు..’

– ఇదీ ఎంపీ బుట్టా రేణుక, టీడీపీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టుకున్న సొంత డబ్బా సారాంశం.!

ఎవరూ తనను అభినందించనప్పుడు తన గొప్పలు తానే చెప్పుకోవాలి కదా.! ఈ విషయంలో మాత్రం చంద్రబాబుకి సాటి ఇంకెవరూ రారంతే. 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు.. ఇదీ 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రోద్భలంతో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పార్టీ ఫిరాయింపుల తీరు. ఒకప్పుడు ఆయనే, పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చారు. ఎప్పుడో ఐదేళ్ళ క్రిందట, పదేళ్ళ క్రిందట కాదు.. ఈ మధ్యనే, తెలంగాణలో తమ పార్టీనిపూర్తిగా అక్కడి అధికార పార్టీ కొల్లగొట్టిన సమయంలో, చంద్రబాబు ఆవేదనాభరితంగా చేసిన వ్యాఖ్యలవి.

చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్‌ డాష్‌ అన్న చందాన, అక్కడ (తెలంగాణలో) రాజకీయ వ్యభిచారమనే విమర్శలు చేసేసి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్టీ ఫిరాయింపుల్ని ఎడా పెడా ప్రోత్సహించేశారు చంద్రబాబు. రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలేనని సరిపెట్టుకోవాలేమో.! అయినా, పార్టీ ఫిరాయింపుల్ని పెంచి పోషించాల్సిన ఖర్మ చంద్రబాబుకి ఏమొచ్చిందట.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.

ఒక్కో ఎమ్మెల్యేకి పది నుంచి పాతిక కోట్ల దాకా ‘ప్యాకేజీలు’ సెట్‌ చేసిన చంద్రబాబు, ఎంపీలకు ఏకంగా 50 నుంచి 100 కోట్ల దాకా ప్యాకేజీల్ని సెట్‌ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేశారు సరే.. ఎంపీల సంగతేంటి.? ఇప్పటికీ ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీలో చేరలేదు.. కానీ, వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పేశారామె. తాజాగా బుట్టా రేణుక కూడా అంతే. చంద్రబాబుకి మద్దతిచ్చారామె, ప్రస్తుతానికి టీడీపీలో చేరలేదు ఈవిడ కూడా. ఎందుకిలా.? అదో సస్పెన్స్‌.

రాజధాని అమరావతి కట్టేశారు, విశాఖకి రైల్వే జోన్‌ తెచ్చేశారు.. ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ తెచ్చేశారు.. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ప్రకటించేశారు.. ఇంకా చాలా చాలా చేసేశారు గనుక, టీడీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు వచ్చేయాలట.. నిస్సిగ్గుగా చంద్రబాబు వచ్చేయమంటున్నారంటే, ఇక ఆయనగారి గురించి అనుకోవడానికేముంది.?

మొత్తమ్మీద, సొంత బలుపు మీద నమ్మకం లేక, ’వాపు‘ ప్రదర్శిస్తున్న చంద్రబాబు – ఆ ప్రదర్శన కోసమిలా పార్టీ ఫిరాయింపులకి తెరలేపుతున్నారన్నమాట.


Recent Random Post: