రజనీ వెనక్కి తగ్గాడా.? ముందడుగు వేస్తాడా.?

రజనీకాంత్‌.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. బాక్సాఫీస్‌ రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ పేరు. ఫ్లాప్‌ మీద ఫ్లాప్‌ వచ్చినాసరే, రజనీకాంత్‌ కొత్త సినిమా మార్కెట్‌ అంచనాలకు మించి వుంటుంది. అదీ సినిమాల్లో రజనీకాంత్‌ స్టామినా. ఆయన మాటే అభిమానులకి అల్టిమేట్‌ థింగ్‌. అలాంటి రజనీకాంత్‌, రాజకీయాల్లోకి వస్తే.!

నిజానికి, రజనీకాంత్‌ రాజకీయాల్లోకొస్తాడన్న ప్రచారం ఈనాటిది కాదు, ఎప్పటినుంచో జరుగుతున్నదే. రాజకీయ రంగ ప్రవేశానికి వీలుగా రజనీకాంత్‌ పలు సినిమాల్లో పొలిటికల్‌ డైలాగులు కూడా పేల్చాడు. అప్పట్లో ఆ డైలాగులు భలేగా పేలాయి. ‘బాబా’ సినిమాలో రజనీ పేల్చిన పొలిటికల్‌ డైలాగుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలిటికల్ ఇంట్రెస్ట్ తోనే రజనీ ఆ సినిమా చేశాడనీ, ఆ సినిమా తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకొస్తాడని అప్పట్లో గాసిప్స్ గుప్పుమన్నాయి. కానీ, రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్‌లోనూ, ఆయన అభిమానుల్లోనూ కన్‌ఫ్యూజన్‌ మాత్రం అప్పటినుంచి, ఇప్పటిదాకా ఇంకా అలాగే వుండిపోయింది.

మధ్యలో అనారోగ్యం సహకరించక, కొంతకాలం సినిమాలకూ దూరమయిపోవాల్సి వచ్చిందిగానీ, లేదంటే పొలిటికల్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ ఈ పాటికే క్లారిటీ ఇచ్చేసి వుండేవాడేమోనన్నది చాలామంది వాదన. గతం గతః ప్రస్తుతానికి వస్తే, ఓ పక్క పొలిటికల్‌ ఎంట్రీపై చర్చోపచర్చల్లో రజీనీకాంత్‌ మునిగి తేలుతోంటే, ఇంకోపక్క ‘అసలు రజనీకాంత్‌ తమిళుడే కాదు’ అంటూ ఆయనకి వ్యతిరేకంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రకటనలు వచ్చాయి. దాంతో, రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై డైలమా మరింత పెరిగింది.

‘ఈసారి పక్కా..’ అన్న మాట, రజనీకాంత్‌ సన్నిహితులు, అభిమానుల నుంచి ఎప్పటికప్పుడు విన్పిస్తూనే వుంది. ఇప్పుడూ అంతే. డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారన్నది తాజాగా వన్పిస్తోన్న గాసిప్‌. ఈసారీ, గతంలోలానే ఆయన సన్నిహితుల నుంచే ఈ విషయమై క్లారిటీ వచ్చింది.

అన్నట్టు, మొన్నీమధ్యనే కమల్‌, తన పుట్టినరోజునాడు రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తాడనే ప్రచారం జరిగినా, కమల్‌ దాన్ని ఖండించాడు. కానీ, తన పుట్టినరోజునాడే ‘రాజకీయాల్లోకి వచ్చేశా..’ అని ప్రకటించుకున్నాడాయన. అఫ్‌కోర్స్‌, రాజకీయాల్లోకి వచ్చేశానన్న మాట కొద్ది నెలల క్రితమే కమల్‌ ప్రకటించేశాడనుకోండి.. అది వేరే విషయం. తాజా ప్రకటన, పుట్టినరోజునాడు ఇంకోసారి వచ్చిందంతే.

రజనీకాంత్‌తో పోల్చితే, కమల్‌ కాస్తంత తొందరగా పొలిటికల్‌ డెసిషన్‌ తీసుకున్నాడనే చెప్పాలి. ఇంతకీ, రజనీకాంత్‌ ఈసారైనా రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టతనిస్తాడా.? అది మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. చూద్దాం.. రాజకీయాల విషయమై రజనీకాంత్‌ వెనక్కి తగ్గుతాడో, ముందడుగు వేసి, తన పుట్టినరోజునాడు రాజకీయ పార్టీని అనౌన్స్‌ చేస్తాడో.!


Recent Random Post: