రేవంత్ రాగానే కొందరు సీనియర్లు పక్కకు!

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఇక ఇప్పుడంతా కాంగ్రెస్ లో తదనంతర పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. రేవంత్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పార్టీ రాజకీయాలు ఎలా కొత్త పుంతలు తొక్కుతాయి? ఎలా ఆయన పార్టీని విజయం వైపు నడిపించడానికి కృషి చేస్తారు? అనేది చర్చనీయాంశంగా ఉంది.

అయితే రేవంత్ రెడ్డితో పోలిస్తే కొమ్ములు తిరిగిన దిగ్గజాలు, ఎంతో సీనియర్లు అయిన రాజకీయ నాయకులు అనేక మంది కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. వారందరికీ కూడా రేవంత్ రాక, ఆయనకు పార్టీ ఇవ్వబోయే ప్రాధాన్యం కాస్త ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ఇదొక్కటే కారణం కాకపోయినప్పటికీ.. రేవంత్ వచ్చిన తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు రాజకీయాలనుంచి పక్కకు తప్పుకునే అవకాశం ఉన్నదని.. పుకార్లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ కు వయసు పైబడిన నాయకులు చాలా మందే ఉన్నారు. వీరి కుటుంబాల నుంచి వీరి తర్వాతి తరం వారసులు కూడా కొంత కాలంగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడానికి రెడీ అయి కూర్చుని ఉన్నారు. వారిక సరైన సమయం కలిసి రావడం లేదు అంతే. కాంగ్రెస్ పార్టీ వారు.. తెలంగాణ ఇచ్చేసిన తర్వాత.. ఏకపక్షంగా అధికారంలోకి వచ్చేస్తాంలే అనుకుంటే.. అంతా బెడిసికొట్టింది.

దాంతో.. అదనుకోసం వేచిఉన్న కొన్ని కుటుంబాల్లోని యువతరం నిరీక్షణ పెరిగింది. నిజానికి తెరమీద కనిపించే నాయకులు చాలా మందికి సంబంధించి.. తెరవెనుక రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్నది వారి వారసులే ప్రధానంగా పుత్రరత్నాలే అనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గనుక కాంగ్రెస్ లో చేరితో.. ఆయనను కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా చేసేంత హామీ కూడా పార్టీ ఇచ్చేట్లయితే గనుక.. ఈ యువతరం మొత్తం డైరక్ట్ పోలిటిక్స్ లోకి దిగుతారని తెలుస్తోంది.

ప్రధానంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి తానే బీజం వేసి రంగం సిద్ధం చేసిన కార్తీక్ రెడ్డి గురించి అంతా చెప్పుకుంటున్నారు. అయితే వీరి కుటుంబం నుంచి ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడప్పుడే రాజకీయాలనుంచి తప్పుకోకపోవచ్చు. రేవంత్ సీఎం అభ్యర్థి అయ్యేట్లయితే గనుక.. తల్లీ కొడుకులు ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలను అటు-ఇటుగా మార్చుకోవచ్చు. జానారెడ్డి లాంటి వాళ్లు పక్కకు తప్పుకునే అవకాశం కూడా ఉంది. ఆయన రాజకీయాల గురించి చాలా కాలంగా విరక్తిగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి తెరమీదకు రావచ్చు.

తెదేపానుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఉమామాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి కూడా రంగప్రవేశం చేయొచ్చు. ఈ ఏజ్ గ్రూప్ లోని చాలా మంది వారసులతో రేవంత్ రెడ్డికి సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది నాయకుల వారసులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారు.. ఈ అందరి స్ఫూర్తితో తండ్రులకు విశ్రాంతి ఇచ్చి తామే రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ నాయకత్వంలో వీరంతా రంగంలోకి దిగితే.. ఇక తెలంగాణ కాంగ్రెస్ బ్రిగేడ్.. మొత్తం యూత్ లుక్ తో కళకళలాడిపోతుందనడంలో సందేహం లేదు. మరి వీరంతా కలసి పార్టీని విజయం దాకా తీసుకెళ్తారా లేదా అత్యుత్సాహమే అవుతుందా వేచిచూడాలి.


Recent Random Post: