
టీడీపీ చేతుల్లోనే అధికారం వుంది. రేప్పొద్దున్న వర్మ, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని నిజంగానే టీడీపీకి వ్యతిరేకంగా తీస్తే, ఎంచక్కా టీడీపీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్‌లో ఆ సినిమా విడుదల కాకుండా చేసెయ్యొచ్చు. తెలంగాణలోనూ మిత్రుడు కేసీఆర్ సహకారం తీసుకుని, అక్కడా సినిమా విడుదల కాకుండా చేయగల ‘శక్తి, సామర్థ్యాలు’ టీడీపీ అధినేత చంద్రబాబుకి వుండనే వున్నాయి. అయినా, టీడీపీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పేరుకే భయపడ్తుండడం విశేషమే మరి.!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైఎస్సార్సీపీ నేత రాకేష్ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత పెరిగింది. అయినా, టీడీపీ వర్మని లైట్ తీసుకుని వుండాల్సింది. మంత్రి లోకేషే నయ్యం, ‘సినిమా గురించి ఏం మాట్లాడతాం.?’ అని లైట్ తీసుకున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒకింత ‘అతి’ చేశారు మీడియా ముందుకొచ్చి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత కూడా వర్మకి వార్నింగ్ ఇచ్చేశారు.
అందరికీ తెల్సిన విషయమే వర్మ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని. కాన్సెప్ట్ ఎంచుకున్నదే వివాదాల కోసం అయినప్పుడు, ఏ చిన్న విమర్శ వచ్చినా అది వర్మకి భలేగా ఉపయోగపడ్తుంది. అందుకే, వర్మ తన మీదకొచ్చే ప్రతి విమర్శనీ పబ్లిసిటీ పరంగా ‘క్యాష్’ చేసుకుంటున్నారనే చెప్పాలి. నిజానికి, టీడీపీ భయం నుంచే వర్మకి నిర్మాత దొరికారన్న వాదనలూ లేకపోలేదు.
మొత్తమ్మీద, ఓ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు కదూ.!
Recent Random Post:

















