
నవంబర్ 10వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. పది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. కానీ, నవంబర్ 2వ తేదీ నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేదెలా.? హాజరయ్యే ఛాన్సే లేదు.!
వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల్ని చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేస్తోందన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. మరోపక్క, పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ నేడు సమావేశం నిర్వహించారు. తన పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలు, వీటితోపాటు కోర్టు తీర్పు తదితర అంశాలపై ఈ సమావేశంలో జగన్ పార్టీ నేతలతో చర్చించారట.
‘మీరు లేకుండా అసెంబ్లీ సమావేశాలకు మేం వెళ్ళి ఉపయోగం లేదు. పైగా, మన పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చారు.. మొత్తంగా 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు.. నైతిక విలువలకు తిలోదకాలిచ్చింది చంద్రబాబు సర్కార్. పార్టీ ఫిరాయించినవారిలో నలుగురు మంత్రులుగా అసెంబ్లీలో అడుగు పెడితే, ఆ అనైతిక చర్యకు అసెంబ్లీ సాక్ష్యమవుతుంది.. అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం దండగ..’ అని పార్టీకి చెందిన సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారట వైఎస్ జగన్ సమక్షంలో.
త్వరలో మరోమారు ఇదే విషయమై భేటీ అయి నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించినట్లు తెలుస్తోంది. పాదయాత్ర విషయంలో ఎలాంటి మార్పూ లేదనీ, నవంబర్ 2న పాదయాత్ర జరుగుతుందనీ, మిగతా విషయాలపై తర్వాత చర్చించుకోవచ్చని వైఎస్ జగన్ పార్టీ నేతలకు చెప్పారట.
మిగతా విషయాలెలా వున్నా, అసెంబ్లీకి గైర్హాాజరయ్యే విషయమై పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ ఏకీభవించినట్లే తెలుస్తోంది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే, మంత్రి హోదాలో అసెంబ్లీలో తమపై విమర్శలు చేస్తోంటే, వాటికి సమాధానిమచ్చే ఛాన్స్ కూడా తమకు దక్కదనీ, అలాంటప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడమన్న భావన వైఎస్ జగన్‌లోనూ వున్నట్లు కన్పిస్తోంది. సో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం కన్పించేందుకు ఛాన్స్ చాలా తక్కువగా వుందన్నమాట. అదే జరిగితే, అసెంబ్లీలో టీడీపీ సోలో పెర్ఫామెన్స్ చేయబోతోందనుకోవచ్చు. బీజేపీ ఎటూ టీడీపీకి మిత్రపక్షమే కాబట్టి, ఆ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు.
Recent Random Post:

















