
ఏపీ రాజధాని అమరావతి- వెలగపూడి .. ఇవన్నీ సాంకేతికంగా ఆఫీసులు కొలువున్న ప్రదేశాలు అయినా.. వాస్తవానికి రాజధాని హోదా వెలగబెడుతున్నది విజయవాడ నగరమే. ఈ నగరంలో నరకంలా మారుతున్న జీవితాల్ని కొంత చక్కదిద్దడానికి కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాదనల దశలో ఉన్న దుర్గగుడి ఫ్లై ఓవర్ పనుల్ని చంద్రబాబునాయుడు తన జమానా వచ్చిన తర్వాత ప్రారంభించారు.
2016లో కృష్ణ నదికి పుష్కరాలు మొదలయ్యే లోగా.. ఈ ఫ్లై ఓవర్ ను పూర్తిచేసేసి.. విజయవాడ నగరానికి పుష్కరాల సమయంలో లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపన సందర్భంగా చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు పనులు జరుగుతున్న తీరును గమనిస్తే.. మరో ఏడాది గడచినా ఫ్లైఓవర్ పూర్తయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు.
కాకపోతే.. జనం తిరిగే రోడ్లకు అడ్డంగా రోడ్ల మీద దిమ్మల్లా ఎత్తుగా ఉన్న ఫ్లైఓవర్ తాలూకు పిల్లర్ లకు రంగులు పూయించి షో చేయడంపై ప్రభుత్వం ఇప్పుడు శ్రద్ధ పెడుతోంది. ఫ్లై ఓవర్ పనులు జరగకపోయినా పర్వాలేదు.. వాటి తాలూకు అవశేషాల ఆనవాళ్లు అందంగా కనిపిస్తే చాలు.. ఆ అందంతో జనాన్ని మభ్యపెట్టవచ్చు… అనేదే చంద్రబాబునాయుడు తాజా పాలనాశైలిలాగా ఉంటోంది మరి!
విజయవాడ నగరంలోంచి కృష్ణ వారధి మీదకు మళ్లే దారిలోను, వెలగపూడి వెళ్లడానికి మళ్లే దారిలోనూ కూడా ఈ పిల్లర్లు రోడ్డుకు అడ్డంగా ప్రభుత్వ వైఫల్యానికి, చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనాల్లాగా దిష్టిబొమ్మల్లాగా నిల్చుని ఉంటాయి. బహుశా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ప్రతిసారీ.. తమ అచేతనత్వం పాలకులకు ప్రభుత్వానికి గుర్తుకు వస్తున్నదేమో.. అందుకని వీటిని అందంగా తీర్చిదిద్దే పని పెట్టుకున్నారు.
రోడ్డుపక్కగా ఉన్న పిల్లర్లకు అందమైన పెయింట్లు పులుముతున్నారు. మోడర్న్ ఆర్ట్ తరహాలో… అర్థంకాని డిజైన్లతోనూ, కాస్త అర్థమయ్యే డిజైన్లతోనూ రంగులు పూసి మాయ చేస్తున్నారు. ఫ్లైఓవర్ పనులకు సంబంధించి.. ఇంకా పూర్తిగా లేవని పిల్లర్లు చాలా ఉన్నాయి. స్థలం అప్పగింతలకు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయని వినిపిస్తోంది. ఫ్లైఓవర్ పనులు ఎక్కడ చూసినా అరకొరగా కనిపిస్తున్నాయే తప్ప ఏ ఒక్క చోట అయినా నికరంగా పని ఒక కొలిక్కి వచ్చిన వాతావరణమే లేదు.
ఇంత ఘోరంగా పనులు జరుగుతోంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదో తెలియదు. గత జులై నాటికి పూర్తి చేసేస్తాం అని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాలు ఆలస్యం అయినా సరే మరో ఆరునెలల జాప్యాన్ని భరించాలి. కానీ.. వారు చెప్పిన గడువు దాటి ఇప్పటికి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటికి పూర్తికాలేదు సరికదా.. మరో ఏడాదివరకు అవుతుందనే నమ్మకం కలగడం లేదు.
ఇటీవల ఓ సమావేశం డిసెంబరులోగా పూర్తి కాకపోతే.. అంతు తేలుస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హూంకరించారు. కాంట్రాక్టర్ల మాత్రం బేఫికర్.. ఇంకా సగం పిల్లర్ల దశలో ఉన్నవి.. ఆరునెలలుగా అదే దశలోనే ఉన్నాయి. నిత్యం ఇక్కడ నగర పౌరుల జీవితానికి నరకం కనిపిస్తోంటే.. ఇలాంటి పనులను వేగంగా నడిపించడానికి సంబంధించి పట్టించుకోకుండా, ఆగిపోయిన పిల్లర్లకు రంగులు పూసి మభ్యపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా ఘోరంగా ఉన్నదని పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.
Recent Random Post:

















