
‘నా పేరు చంద్రశేఖర్.. అంటే శివుడు అని అర్థం. నా కొడుకు క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, హిందువు కాదు.. ఆయన భారతీయుడు.. ఓ సినీ నటుడు..’ అంటూ తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్, తన కుమారుడి తాజా సినిమా ‘మెర్సల్’ సినిమాపై బీజేపీ నేతలు కొందరు విమర్శనాస్త్రాలు సంధించడంపై ఘాటుగా స్పందించిన విషయం విదితమే. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్.. అందుకే, తన సినిమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు అనవసర దుమారాన్ని తెరపైకి తెచ్చారు.
ఇక, ఈ వివాదంపై విజయ్ తాజాగా స్పందించాడు. ఓ పత్రికా ప్రకటన విడుదల చేశాడు. తమిళంలో రాసిన ఈ లేఖలో, పైన తన పేరుని ‘సి. జోసెఫ్ విజయ్’ అంటూ పేర్కొన్నాడు. ‘జీసస్ సేవ్స్’ అనే ప్రస్తావన కూడా ఆ లేఖలో వుండడం గమనార్హం. ‘మెర్సల్’ సినిమాపై కొందరు అనవసర రాద్ధాంతం చేయాలనుకున్నారు, కానీ నాకు చాలామంది అండగా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు.. అంటూ లేఖలో ప్రస్తావించాడు విజయ్.
‘కిక్’ శ్యామ్ అసలు పేరు షామ్. ఆయనో ముస్లిం. ఆ విషయమే చాలామందికి తెలియదు. చెప్పుకుంటూ పోతే, ఆయా హీరోల్ని ఆయా మతాల్ని బట్టి అభిమానులు అభిమానిస్తారనీ, ప్రేక్షకులు ఆదరిస్తారనీ అనుకోవడం మూర్ఖత్వం. పైగా, ఓ సినిమా తమకు నచ్చలేదన్న కారణంగా, ఆ సినిమా హీరోపై మతం రంగు పులమడం అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు.
‘కుక్క కాటుకి చెప్పుదెబ్బ’ తరహాలో బీజేపీ విమర్శలకు విజయ్.. అదేనండీ జోసెఫ్ విజయ్ సమాధానమిచ్చాడనుకోవాలి.!
అన్నట్టు ‘మెర్సల్’ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ నెల 19న సినిమా విడుదల (తమిళ వెర్షన్ తో పాటుగా) కావాల్సి వున్నా, అనివార్య కారణాలతో అది ఆలస్యమయ్యింది.
Recent Random Post: