హిందూ తీవ్రవాదం: ఇది కమల్‌ ‘అతి’వాదం.!

హిందూ ఓటు బ్యాంకు ఎలాగూ కషాయదళానిదే.. అని గట్టిగా నమ్మేవారు, భారతీయ జనతా పార్టీని ‘మతతత్వ పార్టీ’గా అభివర్ణించడం మామూలే. ఆ పేరుతో, ‘ఇతర ఓటు బ్యాంకుని’ తమ ఖాతాలో వేసుకోవాలని దేశంలో చాలా పార్టీలు భావిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీల నోట అప్పుడప్పుడూ ‘హిందూ తీవ్రవాదం’ అనే మాట పుట్టుకొస్తుంటుంది. ఇక్కడ హిందూ తీవ్రవాదం అంటే, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం అని అర్థం చేసుకోవాలేమో.!

అసలు, ప్రపంచమంతా ఇప్పుడు ‘తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదు..’ అని నినదిస్తున్న వేళ, మన దేశంలో మాత్రం మతం పేరుతో ‘తీవ్రవాదాన్ని’ ప్రస్తావిస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం ఎంతవరకు సబబు.? ‘ఇస్లామిక్‌ టెర్రరిజం’ ప్రపంచాన్ని వణికిస్తున్న మాట వాస్తవం. అయినాసరే, ‘ఇస్లామిక్‌ టెర్రరిజం’ అన్న మాట ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే, ఇస్లాం హింసను ప్రోత్సహించదు గనుక.

అలాంటప్పుడు, హిందూ ధర్మం ఏం తప్పు చేసిందని పదే పదే ‘హిందూ తీవ్రవాదం’ అంటూ దేశంలోనే కొంతమంది ‘అతి’ చేస్తున్నట్టు.? ఈ కోవలోకి ఇప్పుడు ప్రముక సినీ నటుడు కమల్‌హాసన్‌ కూడా చేరిపోయారు. ‘హిందూ తీవ్రవాదాన్ని’ అడ్డుకోవడంలో కేరళ సర్కార్‌ విజయం సాధించిందంటూ కమల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటోన్న కమల్‌, ‘నా రంగు కాషాయం కాదు’ అని గతంలో చెప్పడం, ఆ తర్వాత అవసరమైతే ‘బీజేపీతో కలిసి ముందుడుగు వేసేందుకు సిద్ధమని’ ప్రకటించడం తెల్సిన విషయాలే. మళ్ళీ ఇంతలోనే, ఈ ‘హిందూ తీవ్రవాదం’ అంటూ ‘అతి’ చేయడమేంటట.? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కమల్‌హాసన్‌ దేవుడ్ని నమ్మడు. ఇది అందరికీ తెల్సిన విషయమే. అది ఆయన వ్యక్తిగతం. కానీ, హిందూ తీవ్రవాదమంటూ, దేశంలోని హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు ఆయనకెవరిచ్చారు.? ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తినని చెప్పుకునే కమల్‌ నోట, ఇంత తీవ్రమైన పదజాలం వస్తుందని ఎవరూ ఊహించరు. రాజకీయాల్లోకి వస్తున్నాడు కదా, వివాదాలతో పబ్లిసిటీ పొందాలనే ప్రయత్నంలోనే ఇలా ‘అతి’ చేశాడనుకోవాలేమో.!


Recent Random Post: