‘అజ్ఞాతవాసి’ రివ్యూ

నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌
తారాగ‌ణం : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్‌, బోమ‌న్ ఇరానీ, ఖుష్బూ, రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్ర‌రాగ్ త్యాగి, వెన్నెల కిషోర్‌, అజ‌య్ త‌దిత‌రులు
సంగీతం : అనిరుధ్‌
చాయాగ్ర‌హ‌ణం : మ‌ణికంద‌న్‌
కూర్పు : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత : ఎస్‌.రాధాకృష్ణ‌
ద‌ర్శ‌క‌త్వం : త‌్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా విడుద‌ల‌వుతుందంటే.. బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి ఉంటుంది. అభిమానులు, ప్రేక్ష‌కులే కాదు. ట్రేడ్ వ‌ర్గాలు కూడా చాలా ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురుచూస్తుంటాయి. ప‌వ‌న్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎన్ని రికార్డుల‌ను నెల‌కొల్పుతాడ‌నే లెక్క‌లు విడుద‌ల‌కు ముందు నుండే మొద‌లవుతాయి. భారీ అంచ‌నాలు మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా `అజ్ఞాత‌వాసి`. సాధార‌ణంగా ప‌వ‌న్ సినిమా అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. మ‌రి ప‌వ‌న్‌కు త్రివిక్ర‌మ్ తోడైతే ఎలా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు పెద్ద విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నాయి. మ‌రి `అజ్ఞాత‌వాసి` వీరికి హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలిచిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

కథ:
గోవింద్ భార్గ‌వ్ అలియాస్ విందా(బొమ‌న్ ఇరానీ) ప్రముఖ వ్యాపార వేత్త‌. ఏబీ సంస్థ‌ల‌కు అధిప‌తి. కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విందాని, అత‌ని త‌న‌యుడిని వ్యాపార లావాదేవీలు కార‌ణంగా చంపేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) కంపెనీ వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం బాల‌సుబ్ర‌మ‌ణ్యం(ప‌వ‌న్ క‌ల్యాణ్‌)ని మేనేజ‌ర్‌గా నియ‌మిస్తారు. అస్సాం నుండి వ‌చ్చిన బాల‌సుబ్ర‌మ‌ణ్యం మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హారాలు చేసుకుంటేనే.. విందా హ‌త్య‌కు కార‌కులెవ‌ర‌నే దానిపై ఆరా తీస్తుంటాడు. ఇంత‌కు విందాను హ‌త్య చేసిందెవ‌రు? అస‌లు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌మెవ‌రు? అస్సాం నుండి ఏబీ మేనేజ‌ర్‌గా రావ‌డానికి కార‌ణాలేంటి? బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభివ్య‌క్త భార్గ‌వ‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? సీతారామ్‌(ఆదిపినిశెట్టి) ఎవ‌రు త‌న‌కి, విందాకు ఉన్న లింకేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
బ‌లాలు:
– ప‌వ‌న్ క‌ల్యాణ్
– ఇంట‌ర్వెల్ ముందు స‌న్నివేశాలు
– కామెడీ ట్రాక్‌
– సంగీతం
– సినిమాటోగ్ర‌ఫీ

బ‌ల‌హీన‌త‌లు:
– క‌థ అత్తారింటికి దారేది సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం
– బ‌ల‌మైన క‌థ‌నం లేక‌పోవ‌డం
– హీరోయిన్స్ పాత్ర‌ల‌కు త‌గినంత స్కోప్ క‌న‌ప‌డ‌దు
– మెయిన్ క‌థ‌లో స‌బ్ ప్లాట్స్ ఎక్కువ‌గా ఉండ‌టం

స‌మీక్ష:
ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి హీరో సినిమా అంటేనే క‌థంతా అత‌ని చుట్టూనే తిరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా క‌థ కూడా ప‌వ‌న్‌ను బేస్ చేసుకునే ర‌న్ అయ్యింది. బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభిష‌క్త భార్గ‌వ అనే రెండు షేడ్స్‌లో ప‌వ‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై ముందుకు తీసుకెళ్లాడు. త‌న‌దైన మార్కు డైలాగ్స్‌, యాక్ష‌న్స్ సీక్వెన్స్‌, న‌ట‌న‌తో ప‌వ‌న్ అభిమానులను మెప్పించ‌డం ఖాయం. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో పాత్ర ఖుష్బూ.. ఇంద్రాణి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. స్టాలిన్ త‌ర్వాత మ‌రోసారి తెలుగులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డింది ఖుష్బూ. క్లైమాక్స్‌లో ఖుష్బూ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక సినిమాలో భాగ‌మైన కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మయ్యాయి. న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌లు వారివి. ఇక విల‌న్‌గా న‌టించిన ఆది పినిశెట్టి త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. అయితే త‌న రోల్‌ను ఇంకా బ‌లంగా డిజైన్ చేసుంటే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలివేట్ అయ్యుండేది. ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ పాత్ర‌లు కామెడీకి ప‌రిమితం. మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. బేసిక్‌గా ర‌చ‌యిత అయిన త్రివిక్ర‌మ్ త‌న‌దైన డైలాగ్స్‌తో త‌న మార్కును చూపించారు. సంభాష‌ణ‌ల్లో డెప్త్ క‌న‌ప‌డుతుంది. అయితే క‌థ, క‌థ‌నంపై కేర్ తీసుకుని ఉంటే బావుండేద‌నిపించింది. విల‌న్ పాత్ర చిత్రీక‌ర‌ణ బ‌ల‌హీనంగా అనిపిస్తే, హీరోయిన్స్ పాత్ర‌ల‌కు సినిమాలో స్కోప్ లేకుండా పోయింది. ఇక ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ త‌న‌దైన స్టైల్లో మంచి సంగీతాన్ని అందించాడు. మూడు పాట‌లు బావున్నాయి. నేప‌థ్య సంగీతం బావుంది. ముఖ్యంగా ప‌వ‌న్ పాడిన కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా పాట ఆక‌ట్టుకుంటుంది. మ‌ణికంద‌న్ ప్ర‌తి స‌న్నివేశాన్ని చ‌క్క‌గా చిత్రీక‌రించాడు. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పెద్ద కంపెనీ యాజ‌మానుల మ‌ధ్య పోరు అంటే ఎత్తులు, పై ఎత్తులు ఉండ‌టం.. హీరో ఎంట్రీ వ‌చ్చి త‌న కుంటుంటాన్ని కాపాడుకోవడం వంటి స‌న్నివేశాలను చాలా సినిమాల్లో ప్రేక్ష‌కులు చూసేశారు. సినిమాలో ఓ ద‌శ‌లో ప్రేక్ష‌కుడి మెయిన్ కాన్సెప్ట్ అర్థ‌మైపోతుంది కాబ‌ట్టే క‌థ‌పై ఉన్న ఆస‌క్తి త‌గ్గిపోతుంది. అలాగే క‌థ‌లో స‌బ్ ప్లాట్స్ కూడా ఎక్కువైపోయాయి. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి.

బోట‌మ్ లైన్ – ‘అజ్ఞాత‌వాసి’…అభిమానుల కోస‌మే

రేటింగ్ – 2.75/5