అమరావతికే దిక్కులేదు.. ఇంకోటి కావాలా.?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికే దిక్కులేదుగానీ, కర్నూలుని రెండో రాజధానిని చేయాలంటూ టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ‘పాచిపోయిన పాత నినాదాన్ని’ ఫ్రెష్‌గా మళ్ళీ తెరపైకి తెచ్చారు. కామెడీకే పరాకాష్ట అనుకోవాలా.? విజ్ఞతను కోల్పోయి మాట్లాడుతున్న ఇలాంటోళ్ళని చట్టసభలకు ఎందుకు పంపుతున్నట్లు.? అని ఆందోళన చెందాలో తెలియని దుస్థితిలో జనం కొట్టుమిట్టాడాల్సి వస్తోందిప్పుడు.!

కాంగ్రెస్‌ నేతగా వున్నప్పుడే టీజీ వెంకటేష్‌, కర్నూలుని రెండో రాజధానిగా చెయ్యాలనే డిమాండ్‌ని తెరపైకి తెచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతున్న సమయమది. ‘విడిపోకుండా మేం చూస్తాం.. ఒకవేళ విడిపోతే మాత్రం కర్నూలుని రెండో రాజధానిగా చెయ్యాల్సిందే..8 అన్నది టీజీ వెంకటేష్‌ వాదన. ఆయనొక్కరే కాదు, చాలామంది ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు.

ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రం.. (అంటే, ఆరు దశాబ్దాల క్రిందటి మాట అది) కర్నూలు రాజధానిగానే వుండేది. ఆ తర్వాత, దాన్ని హైద్రాబాద్‌ రాష్ట్రంతో కలపడం, అలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటవడం.. ఆ తర్వాత, 2014లో ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడం.. ఇదంతా ఓ పెద్ద ‘చరిత్ర’.!

అభివృద్ధి చెందిన హైద్రాబాద్‌, తెలంగాణకు దక్కింది. బిచ్చమేసినట్లుగా, పదేళ్ళపాటు హైద్రాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా ‘వినియోగించుకోమని’ ఆంధ్రప్రదేశ్‌కి ఆఫర్‌ ఇచ్చింది విభజన చట్టం. ఓటుకు నోటు దెబ్బకి, చంద్రబాబు హైద్రాబాద్‌ని వదిలేసి, విజయవాడకు పరుగులు పెట్టడం, అక్కడే రాజకీయంగా సెటిలైపోవడం తెల్సిన విషయాలే. అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరం.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న చంద్రబాబు, శాశ్వత అమరావతికి సంబంధించి ఇప్పటిదాకా ఒక్క ‘ఇటుక’ కూడా పేర్చలేదు. అమరావతి దుస్థితికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

అయినాగానీ, అక్కడికేదో అమరావతి అద్భుతంగా కనిపిస్తున్నట్లు టీజీ వెంకటేష్‌కి కన్ను కుట్టేసినట్లుంది. కర్నూలుని రెండో రాజధానిగా డిసైడ్‌ చేసి, అమరావతితో సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేసేస్తున్నారు. మింగడానికి మెతుకుల్లేవుగానీ, మీసానికి శంపంగె నూనె కావాలన్నాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు పరిస్థితి అలాగే తయారయ్యింది. జనం ఏమైపోతే పోనీ, తమక్కావాల్సింది రాజకీయ ప్రయోజనం. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలో చేరి, పదవుల పండగ చేసుకోవడం.. పబ్లిసిటీ స్టంట్లు చేయడం. ఇలాంటోళ్ళ వల్లే కదా, ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు ఈ దుస్థితి.!


Recent Random Post: