ఆ ‘బిగ్‌బాస్’ ఎవ‌రు నిమ్మ‌గ‌డ్డ‌?

టాస్క్‌…ఈ మాట ఎప్పుడో, ఎక్క‌డో బాగా విన్న‌ట్టు గుర్తొస్తోందా? ఎప్పుడు విన్నామా అని దీర్ఘాలోచ‌న‌లోకి వెళ్లారా? త‌ల‌ను చేత్తో నెమ్మ‌దిగా త‌డుతున్నారా….అ…ఆ…ఎస్ ఎస్‌..ఇప్పుడు గుర్తొచ్చింది క‌దూ…‘బిగ్‌బాస్’ అని గ‌ట్టిగా అరుస్తున్నారా? అవును మీ స‌మాధానం క‌రెక్టే. బిగ్‌బాస్ రియాల్టీ షోలో ప్ర‌తిరోజూ ప‌దుల సార్లు బిగ్‌బాస్‌తో పాటు కంటెస్టెంట్ల నోట ‘టాస్క్‌’ అనే మాట విన్నాం.

తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ నోట కూడా ‘టాస్క్‌’ అనే మాట వింటున్నాం. ‘స్టార్ మాటీవీ’లో తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్లు పూర్తి చేసుకొంది. నాలుగో సీజన్ ప్రారంభానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

రియాల్టీ షోలో రోజుకొక టాస్క్ ఇస్తూ బిగ్‌బాస్ ర‌క్తి క‌ట్టిస్తాడు. ఇలా వంద‌రోజుల పాటు రియాల్టీ షోలో టాస్క్‌ల పేర్ల‌తో కంటెస్టెంట్ల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టిస్తాడు. షోను గంద‌ర‌గోళ ప‌రుస్తారు. రేపు ఏం జ‌రుగుతుందోన‌నే ఆస‌క్తిని ప్రేక్ష‌కుల్లో రేకెత్తించ‌డం బిగ్‌బాస్ బాధ్య‌త‌.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారం కూడా బిగ్‌బాస్ రియాల్టీ షోను త‌ల‌పిస్తోంది. క‌రోనాపై భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న కాలంలోనే ఆయ‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించాడు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లై, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేష‌న్ల‌లో నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత‌…తీరిగ్గా ఎన్నిక‌ల‌ను వాయిదా వేశాడు. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది.

సీఎం జ‌గ‌న్ నేరుగా మీడియా ముందుకొచ్చి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. నిమ్మ‌గ‌డ్డ కుమార్తె చంద్ర‌బాబు పాల‌న‌లో ఓ కీల‌క పోస్టులో నియామ‌కం కావ‌డం, బాబు హ‌యాంలోనే ఆయ‌న ఎస్ఈసీగా నియ‌మితులు కావ‌డం, పైగా చంద్ర‌బాబు సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో పాటు ఎన్నిక‌ల వాయిదాలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌ల‌కు, అనుమానాల‌కు తావిచ్చింది.

పైగా సీఎస్ లేఖ‌కు స‌మాధానం ఇస్తూ…ఎస్ఈసీ వాడిన భాష అభ్యంత‌ర‌క‌రంగా ఉంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ముందు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించ‌డం కుద‌ర‌ద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిఫ‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ సీఎస్‌కు తేల్చి చెప్పాడు.

సీఎస్‌కు రాసిన మూడు పేజీల లేఖ‌లో ఈ వాక్యాల‌ను గ‌మ‌నిస్తే…నిమ్మ‌గ‌డ్డ కుట్ర‌ను ఇట్టే ప‌ట్ట‌యవ‌చ్చు.

‘కావాలంటే క‌రోనాపై కేంద్ర‌ప్ర‌భుత్వం నియ‌మించిన జాతీయ టాస్క్‌ఫోర్స్ ను సంప్ర‌దించ‌వ‌చ్చు. టాస్క్‌ఫోర్స్ స‌రేనంటే…ఆరు వారాల కంటే ముందుగానే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించేందుకు క‌మిష‌న్‌కు ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు’ ఇదీ నిమ్మ‌గ‌డ్డ వారి హేళ‌న‌తో కూడా స‌మాధానం.

ఇంత‌కూ ఎస్ఈసీకి ఎన్నిక‌ల వాయిదా లాంటి టాస్క్‌లిస్తున్న బిగ్‌బాస్ ఎవ‌రు? ఎన్నిక‌లు వాయిదా వేయాల్సిందేన‌ని ఫోర్స్ చేస్తున్న బిగ్‌బాస్ ఎవ‌రు? ఇంత నిర్ల‌క్ష్యంగా, లెక్క‌లేనిత‌నంతో స‌మాధానం ఇవ్వ‌డం వెనుక బిగ్‌బాస్ ఎవ‌రు? వెన‌క నుంచి బిగ్‌బాస్ ఇస్తున్న టాస్క్ ప్ర‌కార‌మే స్థానిక ఎన్నిక‌లు వాయిదా వేశార‌నే వాస్త‌వం…ఎస్ఈసీ బాడీ లాంగ్వేజీ చెబుతోంది. అయితే ఆ బిగ్‌బాస్ ఎవ‌రో నిమ్మ‌గ‌డ్డ వారే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తే స‌రి!